స్వీడన్‌లో ఫుడ్ సెక్యూరిటీ కోసం 6 నెలల్లోనే ఒక స్టార్టప్‌ను నిర్మించి.. అక్కడి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించిన ఒక భారత యువ పారిశ్రామికవేత్తకు అక్కడి వలస విధానం చుక్కలు చూపించింది. ఫలితంగా కష్టపడి పెంచిన కంపెనీని అమ్ముకుని, కన్నీళ్లతో స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభిజిత్ నాగ బాలసుబ్రహ్మణ్యం అనే ఈ ఎంట్రప్రెన్యూర్ బిజినెస్ జర్నీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
స్వీడన్ విజయం.. కానీ వ్యవస్థ వైఫల్యం
మే 2025లో అభిజిత్ స్వీడన్‌లోని స్కెల్ లెఫ్టియా నగరంలో 'హైడ్రో స్పేస్ స్వీడన్ ఏబీ' అనే మైక్రోగ్రీన్స్ కంపెనీని స్థాపించారు. ఉత్తర స్వీడన్‌లో ఆహార భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా సాగిన ఈ స్టార్టప్.. అనతి కాలంలోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. కానీ వ్యాపారం లాభాల్లో ఉన్నప్పటికీ.. అక్కడి వలస ఏజెన్సీ మైగ్రేషన్ వెర్కెట్ సృష్టించిన అడ్డంకులు యువ వ్యాపారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఎగ్జిట్ కాదు.. బహిష్కరణ
స్వీడన్ నుంచి బయటకు రావటం తనకు ఇష్టపూర్వకంగా జరగలేదని.. ఇది ఒకమైన బలవంతపు బహిష్కరణే అంటూ తన ఆవేదనను లింక్డ్‌ఇన్ వేదికగా పంచుకున్న అభిజిత్. స్వీడన్ వలస ఏజెన్సీకి కనీస వ్యాపార అవగాహన లేదని, డాక్యుమెంటేషన్ విషయంలో స్పష్టత ఇవ్వకుండా తమకు నచ్చినట్లు రూల్స్ మారుస్తూ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. స్వీడన్ తనను తాను స్టార్టప్ ఫ్రెండ్లీ దేశంగా చెప్పుకుంటుంది కానీ.. అది కేవలం ఒక ముసుగు మాత్రమే అంటూ ఘాటుగా విమర్శించారు అభిజిత్.
ALSO READ : మన ఇన్వెస్టర్లకు జపాన్, ఆస్ట్రేలియా స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టే ఛాన్స్
మనోవేదనతో స్వదేశానికి..
నిరంతరం మారే నిబంధనలు, అధికారుల అసహకారం అభిజిత్ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. వ్యవస్థాగత లోపాలు, విదేశీయుల పట్ల వ్యతిరేకత ఉన్న వ్యవస్థతో పోరాడే ఓపిక తనకు లేదన్నారు అభిజిత్. అందుకే కంపెనీని అమ్మేసి తన సొంత దేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం 11 నెలల వ్యవధిలోనే ఒక విజయవంతమైన వ్యాపారవేత్త ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవాల్సి రావటంతో ప్రపంచ స్టార్టప్ కమ్యూనిటీలో దీనిపై భారీగానే చర్చ జరుగుతోంది.
స్వీడన్‌లో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వలస నిబంధనలను కఠినతరం చేస్తోంది. పౌరసత్వం కోసం గతంలో ఉన్న 5 ఏళ్ల కాల పరిమితిని ప్రస్తుతం 8 ఏళ్లకు పెంచడంతో పాటు కఠినమైన భాషా పరీక్షలను ప్రవేశపెట్టింది. ఈ రాజకీయ పరిణామాలే అభిజిత్ వంటి విదేశీ వ్యవస్థాపకులకు శాపంగా మారాయని అంటున్నారు దీన్ని చూసిన ఇమ్మిగ్రేషన్ నిపుణులు.
