భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు అమెరికా షేర్లకే పరిమితమైన అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ లిమిట్.. ఇకపై మరింత విస్తరించనుంది. ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ (NSE IX) తన గ్లోబల్ యాక్సెస్ ప్రొవైడర్ ఫ్రేమ్‌వర్క్‌ను విస్తరిస్తోంది. దీని ప్రకారం మార్చి 31, 2026 తర్వాత దేశంలోని ఇన్వెస్టర్లు జపాన్, యూరప్, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల స్టాక్ మార్కెట్లలో కూడా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందుకుంటారు.
సూపర్ బ్రోకర్ మోడల్:
NSE IX తీసుకువస్తున్న గ్లోబల్ యాక్సెస్ అనేది ఒక సూపర్ బ్రోకర్ ప్లాట్‌ఫారమ్‌లా పనిచేస్తుంది. దీని ద్వారా అంతర్జాతీయ బ్రోకర్లతో అనుసంధానమై.. మన ఇన్వెస్టర్లు విదేశీ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లలో ఉన్న ఈ సౌకర్యాన్ని త్వరలోనే జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు విస్తరించటం కొత్త అవకాశాలను తెచ్చిపెట్టనుంది. ఇది విదేశీ పెట్టుబడుల్లో ఉండే సాంకేతిక ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది.
ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్:
ఈ ప్లాట్‌ఫారమ్‌లోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్. విదేశీ మార్కెట్లలో కొన్ని కంపెనీల షేర్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక షేరును పూర్తిగా కొనలేని వారు.. అందులో కొంత భాగాన్ని కొనుగోలు చేసే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. దీనివల్ల సామాన్య రిటైల్ ఇన్వెస్టర్లు కూడా గ్లోబల్ బ్రాండ్లలో వాటాలను చిన్న ముక్కల రూపంలో కొనుక్కోవచ్చు.
T+1 సెటిల్‌మెంట్:
విదేశీ మార్కెట్లలోనూ వేగవంతమైన లావాదేవీల కోసం T+1 సెటిల్‌మెంట్ విధానాన్ని అమలు చేయాలని ఎన్ఎస్ఈ నిర్ణయించింది. అంటే మీరు షేర్లు కొన్నా లేదా అమ్మినా సదరు ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ జస్ట్ ఒక్క రోజులోనే పూర్తవుతుంది. దీనివల్ల నిధుల బదిలీ వేగంగా జరగడమే కాకుండా, రిస్క్ కూడా తగ్గుతుంది.
►ALSO READ | ఈబేలో 800 మంది ఉద్యోగులపై వేటు.. ఖర్చుల తగ్గించేందుకు ఇండియాలో రిక్రూటింగ్!
టాక్స్ గొడవలు ఉంటాయా..?
చాలామంది విదేశీ పెట్టుబడులంటే పన్నుల విషయంలో భయపడతారు. దీనిపై NSE IX సీఈఓ వి. బాలసుబ్రహ్మణ్యం స్పష్టత ఇచ్చారు. విదేశీ మార్కెట్లలో డివిడెండ్లు లేదా లాభాలపై అక్కడి ప్రభుత్వాలు కొంత పన్ను మినహాయించుకుంటాయని చెప్పారు. అలాగే విదేశాల్లో పన్ను చెల్లించినప్పుడు, భారతీయ ఇన్వెస్టర్లు తమ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌లో ఆ వివరాలను చూపిస్తే, ఇక్కడ పన్ను సర్దుబాటు పొందే అవకాశం దొరుకుతుందట. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. భారతీయులకు విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక పన్ను రాయితీలు ఏమీ ఉండవు. ప్రస్తుత చట్టాల ప్రకారమే పన్నులు ఉంటాయి.
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీకి ప్రోత్సాహకాలు:
బడ్జెట్ 2026 ప్రకారం గుజరాత్ గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు టాక్స్ హాలిడేను 10 ఏళ్ల నుండి 20 ఏళ్లకు పెంచారు. ఇది అంతర్జాతీయ బ్రోకర్లను, ఆర్థిక సంస్థలను గిఫ్ట్ సిటీ వైపు ఆకర్షించడానికి దోహదపడుతుంది. విదేశీ ఇన్వెస్టర్లకు ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి మినహాయింపు ఉండటంతో, గ్లోబల్ లిక్విడిటీ పెరిగే అవకాశం ఉందట. మెుత్తానికి ఈ అవకాశం దేశీయ ఇన్వెస్టర్లకు తమ రిస్క్‌ను డైవర్సిఫై చేసుకునే గొప్ప అవకాశాన్ని అందించనుందని చెప్పుకోవచ్చు.
