ఈబేలో 800 మంది ఉద్యోగులపై వేటు.. ఖర్చుల తగ్గించేందుకు ఇండియాలో రిక్రూటింగ్!

ఈబేలో 800 మంది ఉద్యోగులపై వేటు.. ఖర్చుల తగ్గించేందుకు ఇండియాలో రిక్రూటింగ్!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఈబే మరోసారి ఉద్యోగుల ఏరివేతకు తెరలేపింది. తాజాగా కంపెనీ సుమారు 800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఇది ఈబే మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 6 శాతానికి సమానం. అధికారికంగా కంపెనీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, లింక్డ్‌ఇన్, బ్లైండ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మాజీ ఉద్యోగులు పెడుతున్న పోస్టులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

ముఖ్యంగా అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, ఉటా, ఒరెగాన్ రాష్ట్రాల్లోని వివిధ విభాగాలపై ఈ ప్రభావం పడింది. 10 ఏళ్లకు పైగా కంపెనీలో పనిచేసిన సీనియర్ ఉద్యోగులు సైతం తొలగింపులకు గురయ్యారట. ఒక దశాబ్ద కాలం పాటు ఈ సంస్థలో ఎంతో నేర్చుకున్నాను, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు భారమైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నా అంటూ ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ లేఆఫ్స్ వెనుక అసలు కారణం ఖర్చులను తగ్గించుకోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో ఉన్న కీలక పోస్టులను భారత్, ఐర్లాండ్ వంటి తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న దేశాలకు మళ్లించే యోచనలో ఈబే ఉన్నట్లు సమాచారం. గడిచిన కొద్ది కాలంగా ఈబే తన ఆపరేషన్స్‌ను భారత్ వంటి మార్కెట్లలో విస్తరిస్తూ.. ఇతర దేశాల్లో సిబ్బందిని తగ్గిస్తూ వస్తోంది.

►ALSO READ | మార్వాడీల డబ్బు సీక్రెట్స్ తెలుసా..? ఈ 7 ఆర్థిక సూత్రాలే వారిని సంపన్నులు చేస్తున్నాయ్!

మరోవైపు ఏఐ ప్రభావం కూడా ఈ ఉద్యోగ కోతలపై ఉన్నట్లు తెలుస్తోంది. కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా మానవ వనరుల అవసరాన్ని కంపెనీ తగ్గించుకుంటోంది. టెక్ రంగంలో కొనసాగుతున్న ఈ అనిశ్చితి, ముఖ్యంగా రిమోట్ లేదా ఓవర్సీస్ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని స్పష్టమౌతోంది.