ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు.. క్యాండిడేట్స్ టోర్నీ నుంచి హంపి విత్డ్రా

ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు.. క్యాండిడేట్స్ టోర్నీ నుంచి హంపి విత్డ్రా

న్యూఢిల్లీ: డబుల్ వరల్డ్ చాంపియన్‌, ఇండియా స్టార్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఫిడే విమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది. సైప్రస్‌లోని పాఫోస్‌లో ఈ నెల 28న ఈ టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. 

కానీ, ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో తన వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ  హంపి ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. ‘చాలా ఆలోచించిన తర్వాతే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఎంతటి ముఖ్యమైన ఈవెంట్ అయినా సరే, ప్రాణ భద్రత కంటే ఎక్కువ కాదు. నిర్వాహకులు భరోసా ఇచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో నేను పూర్తి సురక్షితంగా ఉన్నానని భావించడం లేదు’ అని హంపి ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసింది.   

మార్చి ప్రారంభంలో సైప్రస్‌లోని బ్రిటీష్ ఎయిర్ బేస్‌పై డ్రోన్ దాడి జరగడం, ఇరాన్–- -ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో హంపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విమెన్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌ ప్రత్యర్థిని తేల్చే ఈ టోర్నీలో హంపి లేకపోవడంతో టైటిల్ రేసులో ఇండియా అవకాశాలపై ప్రభావం పడనుంది.