ఈ ఏడాది నుంచి ఇంటర్​లో వంద శాతం సిలబస్

ఈ ఏడాది నుంచి ఇంటర్​లో వంద శాతం సిలబస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్​లో వంద శాతం సిలబస్ అమల్లోకి రానుంది. కరోనా పరిస్థితులు చక్కబడటంతో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 2022–23 అకడమిక్ ఇయర్​లో ఫస్టియర్, సెకండియర్​లోనూ దీన్ని అమలు చేయనుంది. పరీక్షల విధానం కూడా కరోనా కంటే ముందున్నట్టుగానే ఉండనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో 2020–21 విద్యా సంవత్సరంలో ఫిజికల్ క్లాసులు నామమాత్రంగా జరిగాయి. దీంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పరీక్షల్లో 30% సిలబస్​ను తొలగించారు. అయితే ఆ టైమ్​లోనే సిలబస్ నుంచి అంబేద్కర్, పూలే, పెరియర్ రామస్వామి లాంటి మహనీయుల పాఠ్యాంశాలను ఇంటర్ బోర్డు తొలగించింది. దీనిపై నిరసనలు రావడంతో మళ్లీ ఆ సిలబస్​ను తీసివేయడం లేదని ప్రకటించింది. 2021–22లోనూ కరోనా కొనసాగడంతో 30% సిలబస్ తొలగించారు. 70 % సిలబస్ మాత్రమే బోధించాలని సూచించారు. ఈ సిలబస్​తోనే ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడం, అకడమిక్ ఇయర్ గాడినపడడంతో వంద శాతం సిలబస్ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది.