భార్యకు కరోనా సోకిందని బాత్ రూమ్‌‌లో ఉంచిన భర్త

భార్యకు కరోనా సోకిందని బాత్ రూమ్‌‌లో ఉంచిన భర్త

మంచిర్యాల: కరోనా సోకిన వారిని ఇంట్లోని ఒక గదిలో ఐసోలేషన్‌లో ఉంచుతుంటారు. కానీ ఒకతను కరోనా సోకిన తన భర్యను ఐసోలేషన్ కోసం బాత్‌రూమ్‌లో ఉంచడం చర్చనీయాంశం అయ్యింది. మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట, గోదావరి రోడ్డులో ఉంటున్న పెద్దయ్య, నర్సమ్మకు కొవిడ్ సోకింది. అయితే ఓ గదిలో ఉంటూ ఐసోలేషన్ ఉంటూ వచ్చిన పెద్దయ్య.. తన భార్యను మాత్రం ఇంట్లో కాకుండా బాత్ రూమ్‌‌లో ఉంచాడు. ఐదు రోజుల నుంచి ఆమెకు బాత్‌ రూమే ఐసోలేషన్ సెంటర్‌ అయింది. పగలు, రాత్రి ఆమె అందులోనే ఉంది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు తెలిపారు. సమాచారం గురించి తెలిసిన వెంటనే ఎస్‌‌ఐ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. 

ఐసోలేషన్ సెంటర్‌కు పంపిస్తానని నర్సమ్మకు ఎస్‌ఐ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. అక్కడ ట్రీమ్‌మెంట్ బాగుంటుందని, రావాలంటూ ఆమెకు నచ్చజెప్పినా మొండికేసింది. దీంతో భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇద్దరు ఒక గదిలోనే ఉండమన్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉండటం,  గదులు ఎక్కువగా లేకపోవడం వల్లే తాను రూమ్‌‌లో ఉండి భార్యను బాత్ రూమ్‌‌లో ఉంచానని పెద్దయ్య పోలీసులకు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత భార్యను ఇంట్లోకి తీసుకెళ్లాడు.