దివ్యాంగుడైన భర్తను చంపి… ఆత్మహత్యగా చిత్రీకరణ

దివ్యాంగుడైన భర్తను చంపి… ఆత్మహత్యగా చిత్రీకరణ

దివ్యాంగుడైన భర్తను హత్య చేసిన కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని ఎల్ బీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎల్ బీనగర్ ఏసీపీ పృథ్వీధర్ రావు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన దివ్యాంగుడైన కాశయ్య(40)కి నాగలక్ష్మితో 15ఏళ్ల క్రితం పెళ్లైంది. ఈ దంపతులు సిటీకి వచ్చి ఎల్ బీనగర్ లోని ఎస్ బీహెచ్ కాలనీలో ఉంటున్నారు. కాశయ్య, నాగలక్ష్మీ సుకృతి అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ లు గా పనిచేస్తున్నారు.వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. నాగలక్ష్మికి గతంలో రెంట్ కి ఉండే దగ్గర సైదులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నాగలక్ష్మి, సైదులు అక్రమ సంబంధం గురించి కాశయ్యకి తెలిసిపోయింది. దీంతో కాశయ్య, నాగలక్ష్మి మధ్య తరచూ గొడవలు జరిగేవి. కాశయ్యను చంపేస్తే ఇద్దరం కలిసి ఉండొచ్చని అతడి భార్య నాగలక్ష్మి, ప్రియుడు సైదులు కలిసి ప్లాన్ వేశారు. ఎలాగైనా కాశయ్యను హత్య చేయాలనుకున్నారు.

ఈ నెల 16న కాశయ్యకి మద్యం తాగించిన నాగలక్ష్మి అతడు మత్తు లోకి వెళ్లగానే సైదులుతో కలిసి గొంతు నులిమింది. స్కిప్పింగ్ తాడును కాశయ్య గొంతుకి బిగించి సైదులు, నాగలక్ష్మి ఇద్దరూ కలిసి అతడి హత్య చేశారు. ఆ తర్వాత కాశయ్య తానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రికరించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం చీరకు కాశయ్య వేలాడదీశారు. అనంతరం నాగలక్ష్మి తనకు ఏమీ తెలియనట్టు నటిస్తూ ఇంట్లోనే ఉండగా..ఆమె ప్రియుడు సైదులు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కాశయ్య తమ్ముడు సురేశ్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సురేశ్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. నాగలక్ష్మి, అతడి ప్రియుడు సైదులుపై అనుమానం ఉన్నట్టు సురేశ్ పోలీసులకిచ్చిన కంప్లయింట్ లో తెలిపాడు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాశయ్య భార్య నాగలక్ష్మిని విచారించగా..తానే సైదులుతో కలిసి భర్తను హత్య చేసినట్టు ఆమె ఒప్పుకుంది. నాగలక్ష్మితో పాటు సైదులును అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్టు ఎల్ బీనగర్ ఏసీపీ పృథ్వీధర్ రావు తెలిపారు.