ఏడేండ్లయినా ఒడ్డునపడ్తలే

ఏడేండ్లయినా ఒడ్డునపడ్తలే
  •     రూ.6 కోట్లు పెట్టినా పూర్తికాని మినీ టాంక్​ బండ్
  •     ఇటీవల టూరిజం శాఖ నుంచి మరో రూ.3.50 కోట్లు మంజూరు
  •     కాంట్రాక్టర్లకు కాసుల ఊటగా మారిన ఎల్లమ్మ చెరువుకట్ట​
  •     పాత పనులు పూర్తికాలే.. కొత్తవి ఎప్పుడు మొదలు పెడ్తరో?

హుస్నాబాద్​, వెలుగు: ఏడాదిలో పూర్తి కావాల్సిన హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్‌ పనులు ఏడేండ్లైనా ఒడ్డున పడడం లేదు. మట్టిపోసి కట్ట ఎత్తు పెంచడం తప్ప మిగతా ఏ పనులూ కంప్లీట్ కాలేదు.  కట్టకుపోసిన మట్టి కూడా వర్షం పడ్డప్పుడల్లా కొట్టుకుపోతోంది. దీంతో కాంట్రాక్టర్లు మళ్లీ మట్టిపోసి బిల్లులు లేపుకుంటున్నారే తప్ప అసలు పనులను పట్టించుకోవడం లేదు.  రూ.6 కోట్లతో చేపట్టిన ఈ పనులు కొలిక్కి రాకముందే టూరిజం డిపార్ట్‌మెంట్‌ ఇటీవల సుందరీకరణ పనుల కోసం మరో రూ3.50 కోట్లు మంజూరు చేసింది. వీటితో వాకింగ్‌, సైక్లింగ్‌ట్రాక్‌, బోటింగ్‌, లైటింగ్‌, పార్కు నిర్మిస్తామని అందులో పేర్కొన్నారు. అయితే పాత పనులే ఇంకా పూర్తి కాలేదు. అయితే చెరువు పనులే పూర్తి కాకపోవడంతో ఈ పనులు ఎప్పుడు మొదలవుతాయోనని స్థానిక ప్రజలు అంటున్నారు. 

కాకతీయుల కాలం నాటి చెరువు

హుస్నాబాద్‌లో కాకతీయులు నిర్మించిన ఎలమ్మచెరువును ప్రభుత్వం మినీ టాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.  2016 మార్చిలో మంత్రి హరీశ్ రావు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు.  ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని మాటిచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు కాంట్రాక్టర్‌‌కు పనులు అప్పజెప్పారు. కానీ, పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌‌ ఏడేండ్లు గడుస్తున్నా మట్టి పనులే చేస్తున్నారు. కిలోమీటరున్నర పొడవునా కట్టపై మట్టి పోసి ఎత్తు పెంచారు. వర్షాలకు ఆ మట్టి కొట్టుకుపోకుండా, కట్ట తెగిపోకుండా సిమెంటుతో డ్రెయిన్లు(కాలువలు) నిర్మించి, సీసీ వాల్స్​, గడ్డితో ఫ్లోర్‌‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో కొంత దూరం డ్రెయిన్లు కట్టి వదిలేశారు. పూర్తిస్థాయిలో గడ్డి ఫ్లోర్‌‌ ఏర్పాటు చేయకపోవడంతో కట్టకు చిన్నచిన్న గండ్లు పడుతున్నాయి. ఆరేండ్ల నుంచి ప్రతి వానాకాలంలో ఇలానే జరుగుతోంది. ఈ పనుల్లో భాగంగా నిర్మించిన తూముకు ఏడాదికింద గండిపడింది.  చెరువుకట్ట పనుల్లో జరిగిన అవినీతిపై అప్పటి కలెక్టర్  నీటిపారుదల అధికారులను నివేదిక అడిగారు. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభం కాకముందే అప్పుడు కొత్తగా నిర్మించిన తూము తెగిపోయింది. 

పైపై మెరుగులతో సరి

చిన్నపాటి వర్షానికే గండ్లు పడి మట్టి కొట్టుకుపోతున్నా కాంట్రాక్టర్‌, అధికారులు‌పెద్దగా పట్టించుకోవడం లేదు.  పైపైమెరుగులు దిద్ది చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ గండ్లలో మట్టి, నాసిరకం మొరం పోస్తూ బిల్లులు తీసుకుంటున్నారని,  ఆరేండ్లుగా ఇలానే చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాల నేతలు  ఎన్నోసార్లు ఆందోళన చేశారు. నాలుగు రోజుల కిందనే బీజేపీ నాయకులు ఇరిగేషన్​ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఈ పనుల్లో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించి  కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫీసర్లు కమీషన్ల కక్కుర్తితో చూపిచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు.  

15 రోజుల్లో పూర్తిచేస్తం​

ఇప్పటివరకు రూ.3.58 కోట్ల పనులు పూర్తయినయ్. గడ్డితో ఫ్లోర్​ఏర్పాటు చేసినా ఎండలకు ఎండిపోయింది. గడ్డిపై నీళ్లు పోస్తున్న క్రమంలో పైపులు కట్టపై ఉంచారు. పంప్​ రన్​ అవుతున్నప్పుడు వర్షం పడింది. అప్పుడు పంపును ఆఫ్​ చేయలేదు. పైపుల ద్వారా నీళ్లు రావడంతో మట్టి కొట్టుకుపోయింది. వీటితోపాటు ఇంకా సీసీ వాల్స్​, చిన్నచిన్న పనులు మిగిలిపోయాయి.  పదిహేనురోజుల్లో పనులు పూర్తవుతయ్​.
- నందా, డీఈఈ, నీటిపారుదల శాఖ