హుజూరాబాద్‌‌లో చెక్‌‌ డ్యాం ఎస్టిమేషన్​ 83 లక్షలకు పెంపు

హుజూరాబాద్‌‌లో చెక్‌‌ డ్యాం ఎస్టిమేషన్​ 83 లక్షలకు పెంపు

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో ఇంకో చెక్‌‌డ్యాం అంచనా వ్యయాన్ని  పెంచేశారు. చెక్‌‌డ్యాంల రివైజ్డ్‌‌ ఎస్టిమేట్లకు ఆస్కారం లేకున్నా అధికార పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టరుకు రూ.83 లక్షలు కట్టబెట్టడానికి గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇచ్చారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం కాంట్రాక్టర్లు నారాజ్‌‌ గాకుండా చూస్తున్నట్లు కన్పిస్తోంది. గతంలో వీణవంక మండలం కల్వల వాగుపై నిర్మించే చెక్‌‌డ్యాం ఎస్టిమేట్‌‌ను రూల్స్​ విరుద్ధంగా పెంచింది. ఇప్పుడు కమలాపూర్‌‌ మండలం మర్రిపల్లిగూడెంలోని శనిగరం వాగు చెక్‌‌ డ్యాం అంచనా వ్యయాన్నీ పెంచింది. 

అప్పట్లో చాన్సే లేదన్నారు..

ఈటల రాజేందర్‌‌ మంత్రిగా ఉన్నప్పుడే హుజూరాబాద్​ లోని మానేరు నది సహా స్థానిక వాగులపై రూ.59.76 లక్షలతో 19 చెక్‌‌ డ్యాంల నిర్మాణానికి అడ్మినిస్ట్రేషన్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలోని పలు చెక్‌‌డ్యాంలను కాంట్రాక్టర్లు ప్రతిపాదిత ప్రాంతంలో గాకుండా వారికి నచ్చిన చోట, నచ్చినట్టు నిర్మించడం స్టార్ట్​ చేశారు. దీనిపై ఇరిగేషన్‌‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి పనుల పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఇంజనీర్లను ఆదేశించారు. చెక్‌‌డ్యాంల స్కోప్‌‌, లొకేషన్‌‌ మార్చినట్టుగా ఇంజనీర్లు నిర్ధారించారు. కొన్ని చోట్ల ప్రమాణాల మేరకు ఫౌండేషన్‌‌ వేయలేదని గుర్తించారు. అప్పట్లో ఈ చెక్‌‌డ్యాంల రివైజ్డ్‌‌ ఎస్టిమేట్లకు కాంట్రాక్టర్ల నుంచి ప్రతిపాదనలు రాగా ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ పెంచబోమంది.  

సీన్​మారింది..

ఈటల బీజేపీలో చేరడంతో చెక్​డ్యాంల ఎస్టిమేషన్​సీన్‌‌ మారిపోయింది. కమలాపూర్‌‌ మండలం మర్రిపెల్లిగూడెంలోని శనిగరం వాగుపై మొదట రూ.2.93 కోట్లతో చెక్‌‌ డ్యాం నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టరే పనులు చేస్తున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.3.76 కోట్లకు పెంచేందుకు అధికారులు గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇచ్చారు. ఇందుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెక్‌‌డ్యాం అంచనాల సవరణకు ఈఎన్సీ(కరీంనగర్‌‌) బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌‌ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేందుకే రూ.83 లక్షలు పెంచేందుకు ఓకే చెప్పినట్టు ఇరిగేషన్‌‌ వర్గాలు పేర్కొంటున్నాయి. జులై 23న వీణవంక మండలంలోని కల్వల వాగుపై నిర్మిస్తున్న చెక్‌‌డ్యాం అంచనా వ్యయాన్ని రూ.1.97 కోట్ల నుంచి రూ.2.45 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. మొత్తం19 చెక్‌‌డ్యాంలలో ఇప్పటి వరకు రెండు చెక్‌‌ డ్యాంల ఎస్టిమేట్లను పెంచారు. మిగతా చెక్‌‌డ్యాంల అంచనాలూ సవరించి త్వరలో ఉత్తర్వులిస్తారని సమాచారం.