జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లికి చెందిన ద్వారపూడి నాగగా గుర్తించారు పోలీసులు. టీఆర్ నంబర్ గల వెర్నా కారును స్వాధీనం చేసుకుని ఎస్ఆర్ నగర్ పీఎస్ కు తరలించారు. నిందితుడు నాగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జనవరి 24న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ గుడి మలుపు దగ్గర అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న తారక్ అనే వక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి... బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా పరారయ్యాడు. సంఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు.. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.
అంతకు ముందు కాసేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తారక్ డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. స్పీడ్ గా వెళితే చలాన్లు వేసే అధికారులు ప్రాణం తీసిన వ్యక్తిని ఇంకా పట్టుకోకపోవడం ఏంటంటూ నిలదీశారు. నిందితుడిని పట్టుకునే వరకు ఆందోళన చేస్తామని చెప్పారు. నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు చెప్పడంతో పీఎస్ నుంచి తారక్ మృతదేహాన్ని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు.
