ల్యాబోరేటరీ ఆఫ్ ఫ్యూచర్.. హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

ల్యాబోరేటరీ ఆఫ్ ఫ్యూచర్.. హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు
  •     లైఫ్​సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం: శ్రీధర్ బాబు 
  •     బయో ఏషియా సమిట్​లో తొలిరోజే 4 కంపెనీల పెట్టుబడులు 
  •     42 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఒపెల్లా జీసీసీ
  •     వ్యాక్సిండో రూ.300 కోట్లు.. ట్రైడెన్స్ రూ.300 కోట్ల పెట్టుబడులు 
  •     రూ.వెయ్యి కోట్లు పెట్టనున్న ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్​ సంస్థ  

హైదరాబాద్, వెలుగు: ఫార్మా రాజధానిగా పేరొంది న హైదరాబాద్​ను లేబొరేటరీ ఆఫ్ ద ఫ్యూచర్​గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి.. కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని నిర్దేశించుకున్నామన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే ‘తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ని రూపొం దించామన్నారు. 

మంగళవారం హైటెక్స్​లో నిర్వహించిన 23వ ఎడిషన్ ‘బయో ఏషియా 2026’ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు లైఫ్ సైన్సెస్ రంగంలో సప్లై కోసం మాత్రమే మన వైపు చూసిన ప్రపంచం.. ఇప్పుడు ప్రస్తుతం ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాల కోసం చూస్తోందన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా తెలంగాణను అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నామని వివరించారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్ఎన్ఏ, జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామన్నారు. 

సీబీఆర్ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం.. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో లాంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అందుకే కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా, నేటి అవసరాలకు అనుగుణంగా కొత్త ఔషధాలను కనుగొనే కేంద్రంగానూ హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.  

పెట్టుబడులు, ఒప్పందాలు ఇవే.. 

ఫ్రాన్స్​కు చెందిన గ్లోబల్ హెల్త్​కేర్​ కంపెనీ ఒపెల్లా హెల్త్​కేర్​.. రాష్ట్రంలో 42 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ఏర్పాటు చేస్తున్నదని, తద్వారా 500 మందికి ఉపాధిని కల్పిం చబోతున్నదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇండొనేషియాకు చెందిన యానిమల్ వ్యాక్సిన్​ కంపెనీ  వ్యాక్సిండో యానిమల్ హెల్త్​ ప్రైవేట్ లిమిటెడ్​.. జీనోమ్ వ్యాలీలో రూ.300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని.. పౌల్ట్రీ, పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లను ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి చేస్తుందని వివరించారు. 

అమెరికాకు చెందిన ట్రెడెన్స్ ఐఎన్​సీ.. 18 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏఐ ఆధారిత హెల్త్​కేర్​, లైఫ్​సైన్సెస్​ అనలిటిక్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నదని, రూ.30‌‌0 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదన్నారు. 

ఇటు ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ అనే సంస్థ.. జీనోమ్ వ్యాలీలో 12 ఎకరాల్లో కొత్త క్యాంపస్​ను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని చెప్పారు. ఇవన్నీ రాష్ట్రానికి శుభసంకేతాలన్నారు. ఈ పెట్టుబడు లు ఉపాధి అవకాశాలను ఎంతో పెంచుతాయని ఆశా భావం వ్యక్తం చేశారు. జీనోమ్ వ్యాలీ ఫేజ్ 4ను వంద ఎకరాలతో విస్తరిస్తామని, గ్రీన్ ఫార్మాసిటీ కోసం అందరినీ ఒప్పించి భూములను సేకరిస్తామన్నారు.