- సీఎం రేవంత్‌రెడ్డితో ఎండీ టిమ్ రైఫిల్ భేటీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణం దృష్ట్యా ఇక్కడ మరిన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని టిమ్ రైఫిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలో కంపెనీ కార్యకలాపాల విస్తరణపై కీలక చర్చలు జరిపారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో హైదరాబాద్‌కున్న ప్రాధాన్యతను గుర్తిస్తూ తమ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. భారత్‌లో తొలిసారిగా సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానాల ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు టిమ్ రైఫిల్ ఈ సందర్భంగా వెల్లడించారు.
అంతర్జాతీయ అవసరాల కోసం ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలను ఉత్పత్తి చేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులతో హైదరాబాద్ రక్షణ రంగ తయారీ విభాగంలో గ్లోబల్ హబ్‌గా మరింత బలోపేతం కానున్నది. కాగా, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
