నవంబర్ 20, 2020. ఇండియా యంగ్ పేసర్, హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు. ఐపీఎల్‌లో సత్తా చాటి టెస్టు టీమ్‌కు ఎంపికై.. ఆసీస్‌లో టీమ్‌మేట్స్‌తో కలిసి సాధన చేస్తున్న సమయాన తన అన్న ఇస్మాయిల్ నుంచి సిరాజ్‌కు ఫోన్ వచ్చింది. ‘నాన్న ఇక లేడు’ అని చెప్పగానే సిరాజ్ గుండె పగిలింది. ఆటో నడుపుతూ తనను ఇంతవాడినిచేసిన తండ్రి కడచూపు కోసం హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని బీసీసీఐ అతనికి చెప్పింది. కానీ,‘ బేటా.. నువ్వు ఇండియాకు ఆడాలి. దేశానికి పేరు తేవాలి’ అని తండ్రి మహమ్మద్ గౌస్ చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. అదే టైమ్‌లో ‘మీ నాన్న కలను నిజం చేసేందుకు ధృడంగా ఉండు’ అని కెప్టెన్ కోహ్లీ ధైర్యం చెప్పడంతో అంత బాధను దిగమింగుతూ ఆసీస్‌లోనే ఉండిపోయాడు 26 ఏళ్ల సిరాజ్. రెండు మూడురోజుల్లోనే మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అతని కష్టం వృథా పోలేదు.
డిసెంబర్ 26, 2020. సిరాజ్ లైఫ్‌లో గుర్తుండిపోయే రోజు కానుంది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో తలపడే ఇండియా ఫైనల్ ఎలెవన్ టీమ్‌లో అతనికి ప్లేస్ దక్కింది. గాయపడ్డ సీనియర్ పేసర్ షమీ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చాడు. దాంతో తన తండ్రి కలను నిజం చేసే అవకాశం సిరాజ్‌కు లభించింది. హైదరాబాద్‌లో గల్లీ క్రికెట్ నుంచిప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో టెస్టు సవాల్‌కు సై అనేంతవరకూ ఎదిగిన ఈ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం…
వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : హైదరాబాద్ బంజారాహిల్స్ ఖాజానగర్‌లో ఓ నిరుపేద కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్. తల్లి కూడా పని చేస్తేగానీ ఇల్లు గడవని పరిస్థితి. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చిన సిరాజ్‌కు ఏడో తరగతి నుంచి క్రికెట్టే లోకమైంది. ఆ టైమ్‌లో ఓ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్‌లో నెగ్గిన కుర్రాడికి గెలుపులో ఉన్న కిక్కు నచ్చింది. అప్పటి నుంచి తరచూ స్కూలుకు డుమ్మా కొట్టడం.. దోస్తులతో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడడం అతని దినచర్య అయింది. చదువును నిర్లక్ష్యం చేయొద్దని తల్లి తిట్టినా.. కొన్నిసార్లు కొట్టినా ఆటపై ఇష్టాన్ని చంపుకోలేకపోయాడు. తన ఉత్సాహానికి తండ్రి ప్రోత్సాహం తోడవడంతో సిరాజ్ ముందుకెళ్లాడు. పాఠాలు చెప్పే కోచ్ లేడు.. కాళ్లకు షూ లేవు. అయినా అన్నీ తానే నేర్చుకున్నాడు. స్వయం ప్రతిభతో మెరుపు వేగంతో బంతులు వేస్తూ గల్లీ క్రికెట్‌లో.. లోకల్ టోర్నీల్లో హీరోగా మారిపోయాడు. 2015 వరకూ టెన్నిస్ బాల్‌తోనే ఆడిన సిరాజ్ ఓ ఫ్రెండ్ సలహాతో అసలైన క్రికెట్ బాల్ అందుకున్నాడు. దానితో మరింత వేగంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ టాలెంట్ చైసిన హైదరాబాద్ మాజీ ఓపెనర్ అబ్దుల్ అజీమ్ అతనికి షూస్ కొనిచ్చి హెచ్‌సీఏ లీగ్‌లో ఆడే అవకాశం కల్పించాడు. అలా క్లబ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యంగ్‌స్టర్ ఎన్నో సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో, ఏడాది తిరక్కుండానే హైదరాబాద్ అండర్–23 టీమ్‌లోకి తర్వాత సీనియర్ టీమ్‌లోకి వచ్చేశాడు.
అలా వెలుగులోకి..
తన టాలెంట్‌తో హైదరాబాద్ రంజీ టీమ్‌లో ప్లేస్ దక్కించుకున్న సిరాజ్ 2015–16 రంజీ సీజన్‌లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. కానీ, ఒకే మ్యాచ్ ఆడే చాన్స్ వచ్చింది. అయితే, తర్వాతి సీజన్ మొత్తం ఆడిన సిరాజ్ హైదరాబాద్‌లోనే కాదు మొత్తం డొమెస్టిక్ క్రికెట్‌లో తన పేరు మార్మోగేలా చేశాడు. ఆ ఏడాది రంజీ ట్రోఫీలో 18.92 యావరేజ్‌తో ఏకంగా 41 వికెట్లు పడగొట్టిన ఈ యువ పేసర్.. 2011–12 తర్వాత హైదరాబాద్‌ను తొలిసారి నాకౌట్స్‌కు చేర్చాడు. ఇక, క్వార్టర్‌ఫైనల్లో 9 వికెట్లు పడగొట్టి డొమెస్టిక్ టాప్ టీమ్ ముంబైని దాదాపు ఓడించినంత పని చేశాడు. రంజీ పెర్ఫామెన్స్‌తో ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియా టీమ్‌లో కూడా చాన్స్ వచ్చింది. ఆ టైమ్‌లో హైదరాబాద్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న టీమిండియా ప్రస్తుత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మార్గనిర్దేశం సిరాజ్‌ను నాణ్యమైన బౌలర్‌గా మార్చింది.
ఐపీఎల్‌తో ఇండియా టీమ్‌లోకి..
2015–16 డొమెస్టిక్ సీజన్‌లో అదరగొట్టిన సిరాజ్ లైఫ్ 2017లో పూర్తిగా మారిపోయింది. ఆ సీజన్ ఐపీఎల్ ఆక్షన్‌లో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన యంగ్‌స్టర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఏకంగా 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. దెబ్బకు సిరాజ్ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయాయి. టోలిచౌకిలో ఇల్లు కట్టుకున్న ఈ హైదరాబాదీ.. తండ్రిని ఖరీదైన లగ్జరీ కారులో తిప్పాడు. ఆ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడి పది వికెట్లు తీసిన సిరాజ్.. ఓ మ్యాచ్‌లో 4/32తో బెస్ట్ పెర్ఫామెన్స్ చేశాడు. అదే ఏడాది నవంబర్‌లో రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ద్వారా సిరాజ్ ఇంటర్నేషనల్ డెబ్యూ కూడా చేశాడు. ఆపై, శ్రీలంక, బంగ్లాదేశ్‌పై చాన్స్ వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయినా.. 2018 ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిరాజ్‌ను సొంతం చేసుకుంది. కానీ, అంతగా సక్సెస్ కాలేకపోయాడు. 11 గేమ్స్‌లో 11 వికెట్లే తీసి నిరాశ పరిచాడు. 2019లోనూ 9 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు మాత్రమే తీసిన సిరాజ్.. కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
రెడ్ బాల్‌తో సక్సెస్
2019 ఐపీఎల్‌కు ముందు అడిలైడ్‌లో ఆసీస్‌పై ఓ వన్డే ఆడిన సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో నేషనల్ టీమ్‌కు దూరమయ్యాడు. ఇంకోవైపు ఐపీఎల్‌లోనూ ఫెయిలైనా డొమెస్టిక్ క్రికెట్‌లో మాత్రం సిరాజ్ జోరు కొనసాగింది. 2018 విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లోనూ ఐదుసార్లు 5 వికెట్ల పెర్ఫామెన్స్‌లు చేసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అదే టైమ్‌లో రెడ్ బాల్‌తో మరింతగా రెచ్చిపోయాడు. సీమ్ మూవ్‌మెంట్, సర్‌ప్రైజ్ బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు. ఇండియా–ఎ తరఫున ఫారిన్ టూర్లలో ఆకట్టుకుంటూ నేషనల్ సెలక్టర్లకు తనను విస్మరించలేని పరిస్థితి కల్పించాడు.
ఇదే గోల్డెన్ చాన్స్
మొన్నటి ఐపీఎల్ సిరాజ్ సెన్సేషనల్ బౌలింగ్‌కు వేదికైంది. అబుదాబిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అతను 3/8తో రెచ్చిపోయాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో రెండు మెయిడిన్లు వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. దీనికితోడు ఇండియా–ఎ తరఫున నిలకడైన ఆటతో మెప్పించడంతో అతనికి టెస్టు టీమ్ నుంచి మళ్లీ పిలుపొచ్చింది. 2018లోనే వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఎంపికైనా బరిలోకి దిగే చాన్స్ రాలేదు. ఈసారి గాయంతో షమీ దూరం కావడంతో అదృష్టం వరించింది. అయితే, తండ్రి చనిపోయిన బాధను దిగమింగుతూ నేషనల్ టీమ్‌తో ఉన్న సిరాజ్ టెస్టు టీమ్‌కు అన్ని విధాలా అర్హుడే. మంచి ఫిజిక్.. పర్‌ఫెక్ట్ రనప్.. మెరుపు వేగంతో బంతులు విసిరే నేచురల్ టాలెంట్ అతని సొంతం. రైట్ హ్యాండర్స్‌ను కట్టడి చేసే స్వింగ్, బౌన్సర్లు అదనపు ఆయుధాలు. ఇలా ఓ నాణ్యమైన పేసర్‌కు కావాల్సిన కంప్లీట్ ప్యాకేజ్ ఈ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ అనొచ్చు. పైగా, లాంగ్ ఫార్మాటే అతని బలం. పేస్‌కు సర్గధామం లాంటి ఎంసీజీ గ్రౌండ్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్న సిరాజ్ ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకుంటే మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం. ఇదివరకే టీ20, వన్డే అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సిరాజ్ టెస్టుల్లో సత్తా చాటాలని ఆశిద్దాం. ఇక, ఇప్పటికే హనుమ విహారి టీమ్‌లో ఉండగా.. సిరాజ్ చేరికతో ఒకేసారి ఇద్దరు హైదరాబాదీల ఆటను చూడబోతుండడం మనకు డబుల్ బొనంజా.
For More News..
కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి మన రియాల్టీ
విరాట్ నావల్లే అవుట్ అయ్యాడు.. లేకపోతే మ్యాచ్ పోయేది కాదు
పార్కింగ్ ప్లేస్‌లు లేవు కానీ.. బండ్లకు ఫైన్లు

