
- ఆదాయంపైనే దృష్టి పెడుతున్న ఏజెన్సీలు
- ఆర్టీసీ రిక్వెస్టులను పట్టించుకోని బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో బస్ షెల్టర్లను అడ్వర్టైజ్మెంట్ ప్రయార్టీగానే ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు ఎక్కువ ఉన్న చోట కాకుండా ఎక్కువగా ప్రకటనలకు అనుగుణంగా ఉండే చోటునే ఏర్పాటు చేస్తున్నారు. అవసరమున్న చాలా చోట్ల బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 1,050 రూట్లలో 2,350 బస్టాపులు ఉన్నాయి. వీటిలో దాదాపు 1,400 బస్టాపుల్లో బస్ షెల్టర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఇంకో వెయ్యి వరకు షెల్టర్లు అవసరం. సిటీలో డైలీ 12 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
అవసరమున్న చోట షెల్టర్లు ఏర్పాటుచేయకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. వీటిని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో 2017లో 5 ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ అప్పగించింది. అయితే టెండర్లలో దక్కించుకున్న ఏజెన్సీలు వారికి ఆదాయం వచ్చేలా మాత్రమే బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా చోట్ల బస్ షెల్టర్లు ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు. బస్ షెల్టర్లను కేవలం బల్దియా ఆదాయ వణరుగా మాత్రమే చూస్తుందే తప్ప ప్రజల అవసరాలకు పట్టించుకోవడం లేదు.
ఆర్టీసీ చెప్పిన చోట ఏర్పాటు చేయట్లే..
ఎక్కడెక్కడా బస్ షెల్టర్లు అవసరమో ఆర్టీసీ అధికారులు గుర్తించి ఆ ప్రపోజల్స్‌ను బల్దియాకు పంపుతారు. ఆ తర్వాత ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించి ఫైనల్ చేయాల్సి ఉంది. జీహెచ్ఎంసీ షెల్టర్ల నిర్మాణ బాధ్యతలను యాడ్ ఏజెన్సీలకు అప్పగిస్తోంది.
ఆర్టీసీ రిక్వెస్టులను జీహెచ్ఎంసీ సీరియస్‌గా తీసుకోవట్లేదు. దీంతో చాలా బస్టాప్‌ల వద్ద షెల్టర్లు ఉండటం లేదు. కొన్ని బస్ షెల్టర్లలో పైకప్పు లేకపోవడంతో వర్షాలకు, ఎండలకు ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. మరికొన్ని షెల్టర్లలో కుర్చీలు ఉండటం లేదు. సిటీలో ఏసీ బస్ షెల్టర్లు ఉన్నప్పటికీ చాలా చోట్ల ఏసీలు పనిచేయడం లేదు.
మెయింటెనెన్స్ గాలికి..
బస్ షెల్టర్ల మెయింటనెన్స్ విషయంపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టడం లేదు. కొన్ని బస్ షెల్టర్లలో ఒక్కరు కూడా కూర్చునే పరిస్థితి లేదు. బస్సుల కోసం వెయిట్ చేస్తున్న ఓల్డేజ్ వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్లపై పదుల సంఖ్యలో బస్ షెల్టర్లు ఉంటున్నాయి. దిల్ సుఖ్ నగర్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, కోఠి, మెహిదీపట్నం, కూకట్ పల్లి, బంజారాహిల్స్ వంటి కమర్షియల్ ఏరియాల్లో వరుసగా బస్ షెల్టర్ లు ఉంటున్నాయి. ఇక్కడ ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. కానీ అవసరమైన చోట్ల పట్టించుకోవడం లేదు. అలాగే ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.
శివం రోడ్డు బస్టాప్ లో బస్ షెల్టర్లు లేకపోవడంతో రోడ్లపైనే ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు. అంబర్ పేట నుంచి విద్యానగర్ వెళ్లే రూట్ లో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్లపై వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ నిరీక్షిస్తున్నారు. ఇక్కడ బస్సు షెల్టర్ ఏర్పాటు చేస్తే స్టూడెంట్స్‌కు మేలు జరుగుతుంది.
మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద 14 బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. వీటన్నింటిని అడ్వర్టైజ్ మెంట్ కోసం వినియోగిస్తుండగా.. ప్రయాణికులకు మాత్రం నాలుగు బస్ షెల్టర్లు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇదే ప్రాంతంలోని పిల్లర్ నంబర్ 33 వద్ద ఆర్మీ ఏరియావైపు అవసరం లేకుండానే బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు.
లంగర్ హౌస్ లో నాలుగు ప్రాంతాల్లో బస్ స్టాప్ లు ఉన్నప్పటికీ ఒక్కచోట మాత్రమే ఒక్క షెల్టర్ ఉంది. లంగర్ హౌస్, బాపూనగర్ రెండు ప్రాంతాల్లో కలిపి నాలుగు స్టాప్ లు ఉన్నాయి. ఇందులో ఒక్క బాపుఘాట్ వద్ద మాత్రమే బస్ షెల్టర్ ఉంది. బాపూనగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లే రూట్ లో బాపునగర్, లంగర్ హౌస్ బస్టాపులకు ఇరువైపులా అసలు బస్టాపులే లేవు. 15 ఏళ్లుగా రోడ్లపై, చెట్ల కింద నిలబడి బస్సులు ఎక్కాల్సి వస్తుంది. నానల్ నగర్ నుంచి లంగర్ హౌస్ వెళ్లే రూట్, వచ్చే రూట్ లోనూ బస్ షెల్టర్లు లేవు. రేతిబౌలిలోనూ ఇరువైపులా బస్ షెల్టర్లు లేవు.
బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అసలు బస్సు సర్వీసే లేదు. కానీ బస్‌షెల్టర్ ఏర్పాటు చేసి ఐదేళ్లుగా అడ్వర్టైజ్మెంట్ స్పేస్ ద్వారా ఏజెన్సీ నెలకు రూ.60 వేల వరకు ఆదాయం పొందుతోంది. కాస్త ముందుకు ఉన్న బస్ స్టాప్ వద్ద మాత్రం అవసరం ఉన్నప్పటికీ అక్కడ ఒక్కటే షెల్టర్ ఏర్పాటు చేశారు.
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ఆవరణలో ఒక బస్ షెల్టర్ అవసరం లేకుండానే ఏర్పాటు చేశారు. లిబర్టీ నుంచి బీఆర్కే భవన్ వెళ్లే రూట్ లో జీహెచ్ ఎంసీ ఆఫీసు గేటు ముందు బస్సులు తిరగకపోయినా ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ స్పేస్ ని సంబంధిత ఏజెన్సీ వాడుతోంది. దీని ద్వారా నెలకు రూ.50 వేలకు పైగానే ఆదాయం వస్తోంది.