నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాల గుట్టురట్టు

నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాల గుట్టురట్టు

ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న రెండు ముఠాల గుట్టును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నౌకరి, షైన్ డాట్.కామ్ వెబ్సైట్ల నుండి నిరుద్యోగుల డాటా తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామంటూ వారికి కుచ్చుటోపీ పెడుతున్నట్లు జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. ఓ సెల్ కంపెనీలో సీనియర్ జనరల్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తామంటూ ఓ ముఠా యువతిని మోసం చేసిందని చెప్పారు. 

రెండో ముఠా కూడా ఓ బడా కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ మరో యువతిని మోసిందని జాయింట్ సీపీ వెల్లడించారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని రెండు కాల్ సెంటర్లలో తనిఖీలు చేసి నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గత ఆరు నెలలుగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి అమాయకులను ముఠా మోసం చేస్తుందని..రిజిస్టేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, ట్రైనింగ్ చార్జెస్, యూనిఫాం చార్జెస్ ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా జాబ్ ఇవ్వడానికంటే ముందే డబ్బులు వసూల్ చేయడం, బ్యాంక్ డోర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ సూచించారు.