హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్

హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్

సికింద్రాబాద్ ప్యాట్నీ ఎస్వీ ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ లో ప్రారంభించిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: జాబ్స్ మేళా ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని… ఈ కొత్త సంవత్సరంలో నూతనోత్సాహంతో ముందుకు సాగాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ కింద సికింద్రాబాద్ ప్యాట్నీ ఎస్వీ ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఈ జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లో 30 కంపెనీలు పాల్గొంటున్నాయని.. దాదాపు మూడు వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుని వచ్చారని తెలిపారు. గత నాలుగైదు సంవత్సరాలు గా జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం, అయితే కరోనా వల్ల గత 9 నెలలుగా కరోనా తో జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ కు బ్రేక్ పడిందన్నారు. ప్రతి ఏటా 2 వేల మంది కి జాబ్స్ కల్పించామని.. ఈసారి ఇంకా ఎక్కువ మందికి జాబ్స్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ జాబ్స్ మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు.. ప్యాట్నీ సెంటర్లో ట్రాఫిక్ జామ్

పోలీసులు నిర్వహిస్తున్న జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో ప్యాట్నీ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు వేల మంది వరకు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తే.. నిరుద్యోగులు రెట్టింపు సంఖ్యలో వచ్చారు. దీంతో ఉదయం నుండే ఈ ప్రాంతమంతా రద్దీ గా మారింది. ఏ ఒక్కరినీ నిరాశకు గురిచేయకుండా అందరికీ అవకాశం కల్పిస్తామంటూ  టోకెన్లు ఇచ్చారు.  దరఖాస్తు చేసుకోకుండా వచ్చిన వారికి వచ్చే వారం రమ్మని చెబుతుండడంతో నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము చాలా దూరం నుంచి వచ్చాము.. ఇప్పుడే ఇంటర్ వ్యూ లు నిర్వహించాలని పదేపదే కోరుతున్నారు. రద్దీని తగ్గించేందుకు టోకెన్ల జారీని నిలిపివేయడంతో చాలా మంది నిరాశతో వెనుదిరుగుతున్నారు.

 

ఇవి కూడా చదవండి..

తమిళనాడులో చోరీ చేసి పారిపోతుంటే.. వెంటాడి పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు

కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

V6 న్యూస్ రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు