సైదాబాద్ హత్యాచారం నిందితుడ్ని పట్టిస్తే 10లక్షలు

సైదాబాద్ హత్యాచారం నిందితుడ్ని పట్టిస్తే 10లక్షలు
  • పట్టించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం
  • హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రకటన

హైదరాబాద్: సైదాబాద్ హత్యాచారం హత్య ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సిటీ పోలీసులు గతంలో ఎన్నడూలేనిరీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడి సీసీ ఫుటేజీ, ఫోటోలు బయటకు వచ్చినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతన్న నేపథ్యంలో పోలీసులు నిందితుడు రాజుపై 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. నిందితుడు రాజుకు సంబంధించిన ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు. హైదరాబాద్  నగర పోలీస్ కమిషనర్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు.
సుమారు 30 ఏళ్ల వయసున్న రాజు (పూర్తిపేరు పల్లకొండ రాజు) పెద్ద జుట్టుకు రబ్బర్ బ్యాండుతో ముడేసుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు చూస్తేనే ఎత్తుగా కనిపిస్తాడు కాబట్టి వెంటనే గుర్తుపట్టొచ్చని పేర్కొంటూ రాజు ఎత్తు 5.9 అడుగులుపైనే ఉంటాడని తెలిపారు. రెండు చేతులపై పచ్చబొట్టుతో మౌనిక అనే పేరు పొడిపించుకున్నాడని తెలిపారు. పారిపోయేముందు సాధారణ ప్యాంటు, షర్టు, టోపీ ధరించి, ఎర్రటి స్కార్ఫ్ ను మెడకు చుట్టుకుని కనిపించాడని ఫోటోలు విడుదల చేశారు. జుట్టుకు తోడు చిరుగడ్డం కూడా ఉందని, నిత్యం మద్యం సేవించి ఫుట్ పాత్ లపైనా, బస్టాండ్లలోనూ నిద్రిస్తుంటాడని తెలిపారు. నిందితుడు రాజును గుర్తిస్తే హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ (ఫోన్ నెంబర్:9490616366), టాస్క్ ఫోర్స్ డీసీపీ (ఫోన్ నెంబర్: 9490616627)లకు  ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.