
- ప్రజావాణిలో అధికారులతో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు : కొత్త ప్రభుత్వం తెచ్చిన పథకాలను పక్కాగా అమలు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అధికారులు తమకు వచ్చిన అర్జీలపై సమీక్ష నిర్వహించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య, విద్య, దేవాదాయ శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని త్వరగా పరిష్కరించాలన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో 59 ఫిర్యాదులు రాగా అందులో గృహ నిర్మాణ శాఖకు 14 వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 45 అర్జీలు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వెంకటాచారి, హైదరాబాద్ ఆర్డీవో సూర్య ప్రకాశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి రంగారెడ్డి కలెక్టర్ భారతి హొళికేరి
చేవెళ్ల, వెలుగు : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హొళికేరి అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ తోపాటు అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, డీఆర్‌ఓ సంగీతతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు కచ్చితంగా ప్రజావాణి హాజరు కావాలని
శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 176 ఫిర్యాదులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.