డ్రగ్స్ డాన్‌‌ ఎడ్విన్ అరెస్ట్

డ్రగ్స్ డాన్‌‌ ఎడ్విన్ అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: డ్రగ్స్‌‌ మాఫియా డాన్ ఎడ్విన్ న్యూన్స్ అలియాస్‌‌ ఎడ్విన్ (45) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌‌ నార్కోటిక్స్‌‌  ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ వింగ్‌‌ పోలీసులు నెల రోజులపాటు పక్కా ప్లాన్ తో గోవాలో  అతడిని అరెస్ట్ చేశారు. అతడిని విచారించి గోవా అడ్డాగా జరుగుతున్న డ్రగ్స్‌‌ సప్లయ్‌‌ గుట్టును విప్పించారు. దేశవ్యాప్తంగా తనకు 50 వేల మంది కస్టమర్లు ఉన్నారని నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రాష్ట్రానికి చెందిన 600 మందిలో 160 మంది రెగ్యులర్ కస్టమర్స్‌‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని గోవా నుంచి హైదరాబాద్‌‌ తరలించి రిమాండ్‌‌ చేశారు. బంజారాహిల్స్‌‌లోని కమాండ్‌‌ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో టాస్క్‌‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఇన్‌‌స్పెక్టర్ రాజేశ్‌‌తో కలిసి సీపీ సీవీ ఆనంద్‌‌ వివరాలు వెల్లడించారు. గోవాకు చెందిన ఎడ్విన్ స్థానిక పబ్స్‌‌లో వెయిటర్‌‌‌‌గా పనిచేసేవాడు. టూరిస్టులకు లిక్కర్‌‌‌‌ సప్లయ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే కస్టమర్లకు అవసరమైన డ్రగ్స్‌‌ను సప్లయ్‌‌ చేసేందుకు ప్లాన్ చేశాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్‌‌కి సంబంధించిన ముడిసరుకును, డార్క్‌‌వెబ్‌‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేసి, గోవాలోని అన్ని బీచ్‌‌లకు సప్లయ్ చేశాడు. టూరిస్ట్‌‌ స్పాట్స్‌‌లో ఎక్కడపడితే అక్కడ వాటిని రిటైల్‌‌ హోల్‌‌సేల్‌‌ రేట్స్‌‌తో అందించేవాడు. ఇందు కోసం స్థానికులు, ఫ్రెండ్స్‌‌తో నెట్‌‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. గోవాకు రెగ్యులర్‌‌‌‌గా వచ్చే టూరిస్ట్‌‌లకు షెల్టర్‌‌‌‌, కావాల్సిన డ్రగ్స్‌‌ను ఆర్డర్లపై బుక్ చేసేవాడు. ఆర్డర్‌‌‌‌ చేసే ప్రాంతాల్లోకి సేల్స్‌‌ బాయ్స్‌‌తో డ్రగ్స్ సప్లయ్ చేసేవాడు.

ఫేక్ కరోనా రిపోర్ట్‌‌తో మస్కా కొట్టాడు

హైదరాబాద్​లో పట్టుబడ్డ డ్రగ్స్ పెడ్లర్లు, కస్టమర్లు ఇచ్చిన సమాచారంతో ఎడ్విన్‌‌ను అరెస్ట్‌‌ చేసేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. ఓయూ, లాలాగూడ, రామ్‌‌గోపాల్‌‌పేట్‌‌ పీఎస్‌‌లో రిజిస్టరైన కేసుల్లో సెర్చ్‌‌ వారెంట్స్‌‌తో గోవాకు వెళ్లారు. స్థానిక పోలీసుల సహకారం లేకపోవడంతో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. దీనికితోడు గోవా బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో ఎడ్విన్‌‌ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అరెస్ట్‌‌ అయ్యి జైలుకెళ్లాడు. బెయిల్‌‌పై రిలీజ్‌‌ అయ్యాక రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిందంటూ ఫేక్ రిపోర్ట్‌‌ సబ్‌‌మిట్‌‌ చేశాడు. దీంతో పోలీసులు ల్యాబ్‌‌కు వెళ్లి వెరిఫై చేశారు. ఫేక్ రిపోర్ట్‌‌గా గుర్తించి స్థానిక పీఎస్‌‌లో కంప్లైంట్‌‌ చేశారు. రాష్ట్ర పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎడ్విన్ అనేక ఎత్తులు వేశాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ టీమ్‌‌ పోలీసులు నెల రోజులుగా గోవాలో మకాం వేసి, పక్కా ప్లాన్‌‌తో శుక్రవారం రాత్రి ఎడ్విన్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌‌ కు తరలించారు.