
- నాసిరకం చాయ్ పత్తాతో రెడ్ లేబుల్, బ్రూక్ బాండ్ ప్యాకెట్లు
- ప్యారాచూట్ డబ్బాల్లో కల్తీ నూనె నింపి అమ్మకం
- సర్ఫ్ ఎక్సెల్, వీల్, టైడ్ పౌడర్లు, సబ్బుల్లోనూ డూప్లికేట్లు
- డేంజరస్ కెమికల్స్‌తో లైజాల్, హార్పిక్
- కాటేదాన్, నాగారంలో తయారీ.. హోల్‌సేల్‌గా సప్లయ్
- ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
హైదరాబాద్, వెలుగు: ప్రముఖ కంపెనీల బ్రాండ్ నేమ్ లతో నకిలీ చాయ్ పత్తా, సర్ఫ్ పౌడర్, సబ్బులు, కొబ్బరి నూనె, ఇతర ప్రొడక్టులను ప్యాక్ చేసి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. బ్రూక్ బాండ్, రెడ్ లేబుల్, ఎవరెస్ట్ మసాల, ప్యారాచూట్ వంటి బ్రాండ్ల పేరుతో నకిలీ ప్రొడక్టులు తయారు చేసి హోల్ సేల్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగ్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
వీరి నుంచి నాసి రకం టీ పొడితోపాటు కల్తీ కొబ్బరి నూనె, సర్ఫ్ పౌడర్లు, సబ్బులు, నకిలీ లైజాల్ లిక్విడ్, హార్పిక్ వంటి రూ. 2 కోట్ల విలువైన ప్రొడక్టులను స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకెట్లు తయారు చేసి.. వాటిని నాసి రకం ప్రొడక్ట్స్ తో ప్యాక్ చేసి హోల్ సేల్, రిటైల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ దందా వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్‌తో కలిసి ఈస్ట్‌జోన్ డీసీపీ గిరిధర్ శనివారం మీడియాకు వెల్లడించారు.
రాజస్థానీల డూప్లీకేట్ దందా
రాజస్థాన్‌కు చెందిన మహేందర్ సింగ్(29) మేడ్చల్ మాల్కజిగిరి జిల్లా కీసర నాగారంలో ఉంటున్నాడు. స్థానికంగా కిరాణ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రొడక్టులను డూప్లికేట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందుకోసం కాచిగూడలో ఉండే రాజస్థానీలు శ్యామ్‌భాటి, కమల్‌భాటితో కలిసి డూప్లికేట్ ఉత్పత్తుల తయారీకి నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడు. బేగంబజార్‌లో హోల్‌సేల్ వ్యాపారం చేసే జయరామ్‌తో నకిలీలు విక్రయించేలా ప్లాన్ చేశారు. వివిధ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన లేబుల్స్, స్టిక్కర్స్, ఖాళీ బాటిల్స్, బాక్సులు సహా ప్యాకింగ్ మెటీరియల్ ను గుజరాత్, బెంగళూర్, ఢిల్లీ నుంచి కొనుగోలు చేసి తెచ్చేవారు. నకిలీ ప్రొడక్టులు తయారు చేసేందుకు కీసర నాగారం, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో గోదాములు ఏర్పాటు చేశారు. బెంగళూర్ నుంచి నాసిరకం టీ పౌడర్ తీసుకొచ్చి రెడ్‌లేబుల్, బ్రూక్‌బాండ్ కంపెనీల పేరుతో ఉన్న బాక్సుల్లో నింపి ప్యాక్ చేసేవారు. స్థానికంగా తక్కువ ధరకు లభించే మసాలాలను కొనుగోలు చేసి ఎవరెస్ట్, ఇతర కంపెనీల పేర్లతో ఉన్న కవర్లలో నింపేవారు. ఇలా అన్ని కంపెనీలకు చెందిన బ్రాండెడ్ స్టిక్కర్స్‌తో డూప్లికేట్ ప్రొడక్టులు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎవరికీ అనుమానం రాకుండా..
హోల్‌సేల్ మార్కెట్‌లో దొరికే నాసిరకం హెయిర్ ఆయిల్ కొనుగోలు చేసి, దానిని రీఫైన్ చేసి.. ప్యారాచూట్ హెయిర్ ఆయిల్‌కు డూప్లికేట్ తయారు చేస్తున్నట్లు కూడా పోలీసుల తనిఖీల్లో తేలింది. సర్ఫ్ ఎక్సెల్, వీల్ సర్ఫ్ పౌడర్, సబ్బులు, కలర్ కెమికల్స్‌తో లైజాల్, హార్పిక్ లిక్విడ్ తయారు చేస్తున్నారు. లేబర్‌కు కూడా అనుమానం రాకుండా ప్యాకింగ్ చేయించేవారు. ఒరిజినల్ కంపెనీలతో పోలిస్తే అంత ఈజీగా గుర్తించే వీలు లేకుండా ప్యాకింగ్ మెటీరియల్ అచ్చుగుద్దినట్లుగా ఉండేలా చూసుకునేవారు. వీటితో నకిలీ ప్రొడక్టులు సిద్ధం చేసి హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్స్, రిటైల్స్, కిరాణ షాపులకు సప్లయ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది.
హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లతో రిటైల్ దందా
నకిలీ దందా కోసం డీలర్లు, ఏజెంట్లతో నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు. బేగంబజార్ వ్యాపారి జయరామ్‌తో పాటు స్థానిక వ్యాపారులకు సప్లయ్ చేసేవారు. ఎమ్‌ఆర్‌పీ కంటే తక్కువ ధరకు విక్రయించేవారు. డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ మార్జిన్ ఇస్తూ నకిలీ ప్రొడక్టులు సప్లై చేసేవారు. అయితే, ఈ డూప్లికేట్ దందా గురించి సమాచారం అందడంతో ఆయా కంపెనీల ప్రతినిధులు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరికో లిమిటెడ్, హిందుస్థాన్, పీఎన్‌జీ లిమిటెడ్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో కలిసి సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు చేశారు. ప్రధాన నిందితుడు మహేందర్ సింగ్‌ను శుక్రవారం కాచిగూడలో అదుపులోకి తీసుకున్నారు. నాగారం, కాటేదాన్‌లోని గోదాములపై దాడులు చేశారు. గోదాముల వద్ద పని చేస్తున్న బిహార్‌కు చెందిన మిథలేశ్ కుమార్(23), త్రియమ్ కుమార్(19)ను అరెస్ట్ చేశారు. దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే డూప్లికేట్ ప్రొడక్టులు సీజ్ చేశారు. శ్యామ్ భాటి, కమల్ భాటి, జయరామ్ పరారీలో ఉన్నారు.