ఫ్యాన్సీ నంబర్లతో మస్తు పైసల్‌‌

ఫ్యాన్సీ నంబర్లతో మస్తు పైసల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  ఆర్టీఏ జారీ చేసే ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రాష్ట్రానికి మస్తు ఇన్‌‌కం వస్తోంది. ప్రెస్టేజీ, క్రేజీ కోసం కొందరు.. న్యూమరాలజీ కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్లను తీసుకుంటూ ఉండటంతో ఆర్టీఏకు ఆదాయం ఏటా పెరుగుతోంది. నచ్చిన నంబర్​ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వాహనదారులు వెనుకాడటం లేదు. 9999 నంబర్​ఈసారి రికార్డు స్థాయిలో రూ.11 లక్షలు పలికింది. ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపుల్లో ఇటీవల ఆన్‌‌లైన్‌‌ విధానం తీసుకొచ్చారు. అయితే ఇది ప్రస్తుతం కొన్ని ఆర్టీఏ కార్యాలయాలకే పరిమితమైంది.

ఈసారి రూ.49.7 కోట్ల ఆదాయం

రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్‌‌ 2 నుంచి ఇప్పటి వరకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.236.73 కోట్ల ఆదాయం వచ్చింది. 2014 నుంచి ఏటా ఫ్యాన్సీ నంబర్ల ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఇందులో రూ.55.58 కోట్లతో 2018–19 ఆర్థిక సంవత్సరం టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 19 వరకు రూ.49.7 కోట్ల ఆదాయం వచ్చింది. 2017–18లో రూ.45.46 కోట్లు, 2016–17లో రూ.39.25 కోట్లు, 2015–16లో రూ.31.11కోట్ల ఇన్‌‌కమ్‌‌ వచ్చింది. 2014–-15లో అత్యల్పంగా రూ.22.63 కోట్లే వచ్చాయి.

జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనే ఎక్కువ

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లోనే ఎక్కువగా ఫ్యాన్సీ నంబర్లు తీసుకుంటున్నారు. అతి ఎక్కువ ఫ్యాన్సీ నంబర్లకు పోటీపడే కార్యాలయంగా హైదరాబాద్ జేటీసీ పరిధిలోని ఖైరతాబాద్ కార్యాలయం తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్, సికింద్రాబాద్ కార్యాలయాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.11,80,21,145 ఆదాయం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌‌ జిల్లాలో రూ.11,42,07,820, మేడ్చల్‌‌ మల్కాజిగిరిలో రూ.9,69,85,357 ఇన్‌‌కమ్‌‌ వచ్చింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌ జిల్లాలో అత్యల్పంగా రూ.10,87,025 మాత్రమే వచ్చింది.

ఆ నంబర్లకే ఇంట్రెస్ట్‌‌..

ఇటీవల కాలంలో వాహనదారులకు ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రెస్టేజీ, క్రేజీ కోసం ఎంత డబ్బు పెట్టయినా సరే ఫ్యాన్సీ నంబర్లు తీసుకుంటున్నారు. మరికొందరు ఇష్టపడి కొనుక్కునే వాహనాలకు న్యూమరాలజీ ప్రకారం ఫ్యాన్సీ నంబర్లు తీసుకుంటున్నారు. ఇందులో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్త, సాధారణ ప్రజలు అనే తేడా లేదు. ముఖ్యంగా కొన్ని నంబర్లకు ఫుల్లు డిమాండ్‌‌ ఉంటోంది. ఇప్పటి వరకు 9999 నంబర్‌‌కే ఎక్కువ డిమాండ్‌‌ ఉంది. ఆర్టీఏ చరిత్రలోనే అత్యధికంగా 9999 నంబర్‌‌ రూ.11లక్షలు పలికింది. ఇదే నంబర్‌‌ 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు పలికింది. 1111, 3456, 0009, 6666, 0001 నంబర్లను కూడా కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు.