హెచ్‌‌‌‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌.. కన్నుగప్పి 16 రోజులుగా టూరిస్ట్ ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు..

హెచ్‌‌‌‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌.. కన్నుగప్పి 16 రోజులుగా టూరిస్ట్ ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు..
  • ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగళూరు, గోవాలో మకాం
  • దేశం విడిచి పారిపోకుండా లుకౌట్​ నోటీస్​ జారీ చేసిన సీఐడీ
  • పుణెలోని త్రీ స్టార్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌లో అరెస్ట్‌‌‌‌ చేసిన అధికారులు.. రిమాండ్‌‌‌‌కు తరలింపు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ క్రికెట్‌‌అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) సెక్రటరీ దేవరాజ్‌‌ రామచందర్‌‌‌‌(63) ఎట్టకేలకు సీఐడీ అధికారులకు చిక్కాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో హెచ్‌‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌‌మోహన్‌‌రావు ఎన్నిక, నిధుల దుర్వియోగం కేసులో దేవరాజ్‌‌ రెండో  నిందితుడు(ఏ2)గా ఉన్నాడు. గత 17 రోజులుగా సీఐడీ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. పక్కా సమాచారంతో మహారాష్ట్ర పుణెలోని  ఓ త్రీ స్టార్‌‌ హోటల్‌‌లో గురువారం సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అక్కడి నుంచి హైదరాబాద్‌‌కు తరలించి.. శుక్రవారం మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్‌‌కు తరలించారు. ఈ కేసులో హెచ్‌‌సీఏ అధ్యక్షుడు జగన్‌‌మోహన్‌‌రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్‌‌కాంటె సహా శ్రీచక్ర క్రికెట్‌‌క్లబ్‌‌అధ్యక్షురాలు కవిత, జనరల్ సెక్రటరీ రాజేందర్‌‌‌‌యాదవ్‌‌ను ఈ నెల 9న సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉప్పల్ మాజీ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ ఎలక్షన్‌‌రెడ్డి ఇచ్చిన ముందస్తు సమాచారంతో దేవరాజ్‌‌తప్పించుకున్నాడు. సీఐడీకి చిక్కకుండా హైదరాబాద్‌‌ విడిచి పారిపోయాడు. 

4 ప్రత్యేక బృందాలతో గాలింపు
దేవరాజ్‌‌ కోసం సీఐడీ అధికారులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. సికింద్రాబాద్‌‌ సైనిక్‌‌పురి డిఫెన్స్‌‌ కాలనీలోని  దేవరాజ్ నివాసం సహా పలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేశారు. దేశం విడిచి పారిపోకుండా లుకౌట్​సర్క్యులర్‌‌ జారీ చేశారు. హైదరాబాద్‌‌సహా వైజాగ్‌‌, తిరుపతి, తమిళనాడు, బెంగళూరు, గోవాసహా టూరిస్ట్ ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ దేవరాజ్‌‌ సీఐడీకి చిక్కకుండా తప్పించుకొని తిరిగాడు. కాగా, ఆయన కుటుంబ సభ్యులపైన సీఐడీ అధికారులు నిఘా పెట్టారు.

దేవరాజ్​పుణెలో ఉన్నట్లు తెలియడంతో ఓ త్రీస్టార్‌‌‌‌ హోటల్‌‌లో రైడ్​ చేసి, పట్టుకున్నారు. జగన్‌‌మోహన్ రావుతో కలిసి దేవరాజ్​ హెచ్‌‌సీఏ నిధుల దుర్వినియోగంలో కీలక పాత్ర పోషించినట్లు కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్‌‌ క్లబ్‌‌ అధ్యక్షురాలు కవిత,  క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్‌‌కు మల్కాజిగిరి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దేవరాజ్ అరెస్ట్‌‌తో ఈ కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరింది.