- 11వ ‘డెంటిస్ట్రీ’ సదస్సులో హైదరాబాద్ డెంటిస్ట్ వికాస్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: కొసోవో రాజధాని ప్రిస్టినాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక 11వ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ డెంటిస్ట్రీ విత్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ సదస్సుకు ఇండియా తరఫున హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డెంటిస్ట్, గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ గౌడ్ ప్రత్యేక ఆహ్వానిత వక్తగా హాజరయ్యారు. కొసోవో ప్రధాని అల్బిన్ కుర్తి, హెల్త్ మినిస్టర్డాక్టర్ అర్బెన్ విటియా సదస్సును ప్రారంభించారు.
పంటిని తొలగించిన తర్వాత నెలల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా, ఎంపిక చేసిన పేషెంట్లకు అదేరోజు ఇంప్లాంట్ వేసి స్థిరమైన తాత్కాలిక దంతాన్ని అమర్చే ఇమీడియట్ ఎక్స్ ట్రాక్షన్, ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లేస్ మెంట్ అండ్ లోడింగ్ వంటి అధునాతన చికిత్సా విధానాలపై డాక్టర్ వికాస్ గౌడ్ ప్రసంగించారు. ఎముక జీవశాస్త్రంపై పట్టు, పేషెంట్ఎముక సాంద్రత, నాణ్యత ఆధారంగా ముందు, -వెనుక పళ్లతోపాటు, అన్ని దంతాలు కోల్పోయిన వారికి 4 లేదా 6 ఇంప్లాంట్లతో రోజువారీ పనులు ఆగిపోకుండా వేగంగా ముఖ సౌందర్యాన్ని, నమిలే సామర్థ్యాన్ని ఎలా తిరిగి తీసుకురావచ్చో వివరించి, ప్రశంసలు అందుకున్నారు.
