అదే పనిగా ఫోన్ చూస్తున్నారా.. కళ్లు పోతయ్

అదే పనిగా ఫోన్ చూస్తున్నారా.. కళ్లు పోతయ్

ఏ విషయంలోనైనా అతి అనేది ఎప్పటికైనా ప్రమాదానికే దారి తీస్తుంది. అలాగే టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అన్ని నష్టాలూ ఉన్నాయి. టెక్నాలజీ మోజులో చాలా మంది స్ట్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోయి విలువైన సమయంతో పాటు, దృష్టి సంబంధమైన వ్యాధులనూ కొనితెచ్చుకుంటున్నారు. ఈ తరహాలోనే ఇటీవల తన దగ్గరకు వచ్చిన ఓ మహిళ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోందని హైదరాబాద్ కు చెందిన డా. సుధీర్ కుమార్ తెలిపారు. ఈ రకమైన వ్యాధిని స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటారన్నారు. అయితే అతిగా స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల ఆ మహిళ తన చూపును కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రోజులో చాలా గంటలు ఫోన్ తో గడపడం, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత రాత్రి 2గంటల ప్రాంతంలోనూ ఆమె ఫోన్ బ్రౌజ్ చేస్తుండేదన్నారు. అయితే ఆమెకు తాను ఎలాంటి మందులు ఇవ్వలేదని, కేవలం స్మార్ట్ ఫోన్ ను వాడడం తగ్గిస్తే చాలని సూచించినట్టు చెప్పారు. తాను చెప్పినట్టుగానే మొబైల్ ను అవసరానికి మాత్రమే ఆమె వినియోగించి... కేవలం నెల రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు.

ఆమెకు ఇప్పుడు దృష్టి లోపం పోయిందన్న డా. సుధీర్ కుమార్...రాత్రి పూట కనిపించకపోవడం, వెలుగులను చూడలేకపోవడం లాంటి సమస్యలేమీ లేవని తెలిపారు. కాబట్టి డిజిటల్ పరికరాల స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడకుండా చూడాలని డాక్టర్ ప్రజలను కోరుతున్నారు. ఇది తీవ్రమైన దృష్టి సంబంధిత సమస్యలను కలిగిస్తుందని హెచ్చరించారు. డిజిటల్ స్క్రీన్ (20-20-20 నియమం) ఉపయోగిస్తున్నప్పుడు 20 అడుగుల దూరంలో ఉండాలని, ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల విరామం తీసుకోవాలని ఆయన సూచించారు.