ఎడమ కాలికి అనారోగ్యం.. కుడి కాలికి శస్త్ర చికిత్స

ఎడమ కాలికి అనారోగ్యం.. కుడి కాలికి శస్త్ర చికిత్స

కొన్నిసార్లు వైద్యుల చేసిన చిన్న తప్పిదాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. అనారోగ్యం చేసిందని డాక్టర్ వద్దకు వెళితే.. చేయాల్సిన చికిత్సకు బదులుగా వేరే చికిత్స అందిస్తే ఆ పేషెంట్.. మరో వ్యాధి లేదా ప్రమాదానికి గురవుతాడు. అలాంటి ఘటనే రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. ఎడమ కాలికి చికిత్స చేయబోయి, ఆరోగ్యంగా ఉన్న కుడి కాలికి డాక్టర్ చికిత్స చేయడం అందర్నీ కలవరానికి గురి చేస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన ఆర్థోపెడిషియన్ కరణ్ ఎం. పాటిల్ అనే వైద్యుని వద్దకు వచ్చిన ఓ వ్యక్తికి  ఎడమ కాలికి బదులుగా , ఆరోగ్యంగా ఉన్న కుడి కాలికి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత తప్పును తెలుసుకున్న వైద్యుడు.. తిరిగి ఎడమ కాలికి ఆపరేషన్ చేశారు. అందర్నీ ఆశ్చర్యంతో పాటు, భయాందోళనలకు గురిచేసే ఈ ఘటనలో వైద్యుడిని బాధ్యుడిగా చేరుస్తూ.. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. అంతే కాదు అతని లైసెన్స్‌ను సైతం రద్దు చేసింది.

ఈ ఘటనపై బాధితురాలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)కి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మెడికల్ కౌన్సిల్ ఆ వైద్యున్ని దోషిగా తేల్చింది. దాంతో పాటు వైద్యుల లైసెన్సును ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ మండలి చైర్మన్ వి.రాజలింగం ఏప్రిల్ 13న ఉత్తర్వులు జారీ చేశారు.

మరో కేసులో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్‌ వైద్యుడి లైసెన్సును కౌన్సిల్‌ మూడు నెలలపాటు సస్పెండ్‌ చేసింది. డెంగ్యూ రోగిని మెరుగైన ఆస్పత్రికి తరలించకపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోగి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో డాక్టర్‌ సిహెచ్‌. శ్రీకాంత్ మెరుగైన సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి సకాలంలో రిఫర్ చేయకపోవడంతో రోగి మృతి చెందాడని తేలింది.

ఈ ఘటనలో జిల్లా కలెక్టర్‌ నివేదిక ఆధారంగా మెడికల్‌ కౌన్సిల్‌ విచారణ చేపట్టి వైద్యుల లైసెన్స్‌ను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరు డాక్టర్లు తమ సర్టిఫికెట్లను కౌన్సిల్‌కు సరెండర్ చేయాలని ఆదేశించింది. అయితే వైద్యులు సస్పెన్షన్‌పై 60 రోజుల్లో అప్పీల్ దాఖలు చేసుకునే అవకాశం ఉండడం గమనార్హం.