10 రోజుల బిడ్డకు గుండెపోటు.. డాక్టర్లు ఎలా కాపాడారంటే..?

10 రోజుల బిడ్డకు గుండెపోటు.. డాక్టర్లు ఎలా కాపాడారంటే..?

గుండెపోటు అనేది పెద్దవారికి వారికి మాత్రమే వస్తుందన్నది ప్రజలలో ఉన్న భావన. అది వాస్తవం కాదు. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. పది రోజుల పసిబిడ్డ కూడా గుండెపోటుకు గురవుతోంది. ఆ కోవకు చెందిందే ఈ కథనం. 10 రోజుల బిడ్డకు గుండెపోటు రాగా.. సీపీఆర్ చేసి ఆ బిడ్డకు ప్రాణం పోశారు.. వైద్యులు. 

కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన జయమ్మ అనే మహిళ ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే సదరు మహిళకు హైబీపీ ఉన్నందున ఏడో నెలలోనే సి-సెక్షన్ చేసి.. బిడ్డను బయటకు తీశారు. ఆ సమయంలో శిశువు బరువు కేవలం 1.5 కిలోలు మాత్రమే. ఏడో నెలలో జన్మించడంతో శిశువు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరు సరిగా ఉండేది కాదు. అందునా ప్లేట్లెట్ కౌంట్ 9000కి పడిపోవడంతో.. గుండెకు రక్త ప్రసరణ సరిగా జరిగేది కాదు.

ఈ క్రమంలో బిడ్డకు మెరుగైన ఆరోగ్యం కోసం సదరు వైద్యులు.. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆ సమయంలో శిశువు ఆరోగ్యం అంతంతమాత్రమే. దీంతో వైద్యులు.. 6 రోజుల పాటు బిడ్డను కృత్రిమ వెంటిలేషన్‌లో ఉంచి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి పసికందు గుండె ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు.. బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. 

శిశువు వయస్సు 10 రోజులు మాత్రమే. అందునా బహుళ అవయవ వైఫల్యం ఉన్నప్పటికీ సీపీఆర్ చేసి ప్రాణం పోసిన వైద్యులకు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.