బెంగళూరు నుంచి డ్రగ్స్ ..ఇద్దరు యువకులు అరెస్ట్.. మాదాపూర్ పోలీసుల అదుపులో నిందితులు

బెంగళూరు నుంచి డ్రగ్స్ ..ఇద్దరు యువకులు అరెస్ట్.. మాదాపూర్  పోలీసుల అదుపులో నిందితులు
  • గోవా నుంచి డ్రగ్స్​తెచ్చుకున్న ఓ సిమెంట్​వ్యాపారి కూడా..

మాదాపూర్, వెలుగు: బెంగుళూరు నుంచి నగరానికి డ్రగ్స్​తెప్పించుకున్న ఇద్దరు యువకులను మాదాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. సీఐ కృష్ణమోహన్​తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన భరత్​రెడ్డి ట్రావెల్ వ్లాగర్​గా చేస్తున్నాడు. 

హయత్​నగర్​కు చెందిన రాకేశ్​ నగరంలో ఉంటూ హోటల్ మేనేజ్​మెంట్ కాలేజీలో చదువుతున్నాడు. ఇద్దరికీ ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉండటంతో ఈ నెల 26న రాత్రి బెంగళూరు నుంచి ఎండీఎంఏ తెప్పించుకొని, మాదాపూర్​అయ్యప్ప సొసైటీలో రిసీవ్​చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. భరత్​రెడ్డిపై ఇదివరకే మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. రాకేశ్ ఎండీఎంఏను విక్రయించేందుకు తెప్పించుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్​చేశామన్నారు.

రాయదుర్గం పరిధిలో..

ఎంజాయ్​ చేసేందుకు గోవాకి వెళ్లి, వచ్చేటప్పుడు డ్రగ్స్​తెచ్చుకున్న ఓ సిమెంట్ వ్యాపారిని మాదాపూర్​ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్​చేశారు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన  స్రికిరెడ్డి పృథ్వీ గతంలో ఎంఎస్​ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే తండ్రికి క్యాన్సర్​రావడంతో తిరిగి సొంతూరుకు వచ్చాడు. నెల్లూరులోనే ఉంటూ సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. 

ఈ క్రమంలో డ్రగ్స్​కు అడిక్ట్​ అయిన పృథ్వీ.. ఫ్రెండ్స్​తో కలిసి తరచూ గోవా వెళ్తున్నాడు. అక్కడినుంచి డ్రగ్స్​ తెచ్చుకొని హైదరాబాద్​లేదా సొంతూరుకు వెళ్తున్నాడు. ఈ నెల 26న గోవా నుంచి డ్రగ్స్​తో నగరానికి వచ్చిన పృథ్వీ గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్ వద్ద ఉన్నాడన్న సమాచారంతో ఎస్​వోటీ పోలీసులు వెళ్లి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

 11.27 గ్రాముల గంజాయి, 1.32 గ్రాముల ఓజీకుష్​, 1.43 గ్రాముల 3  ఎండీఎంఏ పిల్స్​ను స్వాధీనం చేసుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. పృథ్వీని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.