
హైదరాబాద్/అబిడ్స్/ఎల్ బీనగర్, వెలుగు: శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు ఏడుగురు అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మలక్‌పేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి మహ్మద్ అక్బర్ అలీ ఖాన్, ఖైరతాబాద్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి షాబాద్ రమేశ్, ఇదే సెగ్మెంట్‌కు కురాకుల జ్యోతి, సికింద్రాబాద్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాహుల్ గుప్తా , గోషామహల్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ మొగిలి సునీత ఒక్కో సెట్ చొప్పున నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
అంబర్ పేటలో శివసేన నుంచి సుదర్శన్, గోషామహల్ నుంచి సోషలిస్ట్ పార్టీ ఇండియా అభ్యర్థి బీవీ రమేష్ బాబె రెండు సెట్ల చొప్పున నామినేషన్లు వేసినట్లు రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. నాంపల్లి, కార్వాన్, ముషీరాబాద్ సెగ్మెంట్లకు సంబంధించి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో ఆరు నామినేషన్లు..
శామీర్‌పేట/జీడిమెట్ల: మేడ్చల్ జిల్లాలో మొదటి రోజు 6 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మేడ్చల్ సెగ్మెంట్‌కు 2, ఉప్పల్ సెగ్మెంట్ కు 2, మల్కాజిగిరి నుంచి ఒకటి, కూకట్పల్లి నుంచి ఒక నామినేషన్ దాఖలైందన్నారు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ నుంచి ఒక్క నామినేషన్ కూడా రాలేదని కలెక్టర్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో..
ఎల్బీనగర్/ఇబ్రహీంపట్నం/గండిపేట/చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ సెగ్మెంట్లో మొదటిరోజు 2 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో పంకజ తెలిపారు. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్‌కు సంబంధించి పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ ఫౌండర్, రిటైర్డ్ ఐపీఎస్ సదానందరెడ్డి నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్ సెగ్మెం
ట్ కు సంబంధించి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఆర్వో మల్లయ్య తెలిపారు. చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం తరఫున ఆయన కొడుకు ప్రమోద్ నామినేషన్ వేశారు.