
- జీనోమ్ వ్యాలీలో 200 పైగా కంపెనీలు
- సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోని టాప్ లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా హైదరాబాద్ ఎదిగిందని ఇంటర్నేషనల్రియల్ఎస్టేట్కంపెనీ సీబీఆర్ఈ ఇండియా, ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా చైర్మన్, సీఈఓ అన్షుమాన్ మ్యాగజైన్ అన్నారు. తమ సంస్థ విడుదల చేసిన ‘గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్’ రిపోర్టు గురించి ఆయన మాట్లాడుతూ 2024లో ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆర్ అండ్‌డీ, ల్యాబ్ ప్రాపర్టీలు నిర్మాణంలో ఉన్నాయని, అమెరికా లైఫ్ సైన్స్ కేంద్రంగా కొనసాగుతోందని చెప్పారు. అయినా, ఆసియా–-పసిఫిక్ (హైదరాబాద్, బీజింగ్, షాంఘై, గ్రేటర్ టోక్యో), కెనడా (టొరంటో, మాంట్రియల్), యూరప్ (కేంబ్రిడ్జ్, పారిస్) వంటి ప్రాంతాలు కూడా ప్రధాన కేంద్రాలుగా ఎదుగుతున్నాయని తెలిపారు.
‘‘హైదరాబాద్ జీవశాస్త్ర తయారీ కార్యకలాపాల్లో ప్రపంచస్థాయిలో ప్రాధాన్యం పొందింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని లైఫ్ సైన్సెస్ రంగంలో భారతదేశం సత్తా చాటింది. ఫార్మాస్యూటికల్, బయోటెక్, మెడికల్ డివైజెస్ కంపెనీల విస్తరణ దీనికి కారణం. ఈ రంగం పెరుగుదలలో హైదరాబాద్ కీలకమని రిపోర్టులు చెబుతున్నాయి. పరిశోధన, తయారీ కార్యక్రమాల్లో ముఖ్య కేంద్రంగా నగరం ఎదిగింది. మొత్తం మందుల ఉత్పత్తిలో దాదాపు మూడో వంతు, ఎగుమతుల్లో ఐదో వంతు, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్ నుంచే జరుగుతున్నది”అని ఆయన వివరించారు.
పెరుగుతున్న కార్యకలాపాలు
భారతదేశంలో లైఫ్ సైన్సెస్ కంపెనీల ఆఫీసు స్థలం లీజింగ్ఏడాది ప్రాతిపదికన సుమారు 56 శాతం పెరిగిందని అన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అత్యధిక స్థాయి లీజింగ్ అన్నారు. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగడం, తయారీ సామర్థ్యం మెరుగవడం, నిపుణులు తక్కువ వేతనాలకు దొరకడం, పరిశోధన, అభివృద్ధిపై పెరుగుతున్న దృష్టి, జనాభా పెరుగుదల కారణమని చెప్పారు.
ఈ అంశాలన్నీ భారత లైఫ్ సైన్సెస్ రంగాన్ని ముఖ్యంగా హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన హబ్‌గా మారుస్తున్నాయని అన్షుమన్ వివరించారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ 18 దేశాల నుంచి వచ్చిన 200 పైగా బయోటెక్, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా మారిందని ఆయన చెప్పారు.