గచ్చిబౌలి: వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ

గచ్చిబౌలి: వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ
  •     వానకాలంలో పబ్లిక్​ ట్రాన్స్​పోర్టును ప్రోత్సహించాలి
  •     అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌‌‌‌లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ రద్దీని పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్‌‌‌‌లో వర్షాకాల సన్నద్ధత, వాటర్ లాగింగ్ పాయింట్లు, ట్రాఫిక్ నిర్వహణపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్​ ఎం.రమేశ్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన, సైబరాబాద్ పరిధిలోని డీసీపీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సైబరాబాద్ పరిధిలోని మైనర్, మీడియం, మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జయేష్ రంజన్ అధికారులకు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్లు, ట్రాఫిక్ రద్దీని డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలతో కలిసి కార్‌‌‌‌పూలింగ్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.