టూరిస్టు స్పాట్‌గా లింక్ రోడ్లు

టూరిస్టు స్పాట్‌గా లింక్ రోడ్లు

హైదరాబాద్, వెలుగు: అటు ఇటు గుట్టలు.. మధ్యలో తోవ.. అలాంటి దారుల్లో పోతుంటే మస్తు థ్రిల్లింగ్​గా ఉంటది.  ఏదో అడ్వెంచర్ రైడ్ చేస్తున్నమనే ఫీల్ కూడా వస్తది. అలాంటి ఎక్స్ పీరియన్స్ కావాలంటే ఏ  హిల్ ఏరియాలకో పోవాలని అనుకుంటరు. కానీ ఆ అవసరమే లేదు. మన దగ్గర్నే అలాంటి రోడ్లు మస్తు ఉన్నయ్. సిటీలో ట్రాఫిక్​ని తగ్గించడానికిప్రభుత్వం అప్పట్లో లింక్ రోడ్లనే కాన్సెప్ట్​ను తీసుకొచ్చింది. ఈ లింక్ రోడ్లు రూట్లను కలుపుతూ ఉంటాయి. ట్రాఫిక్​ని కంట్రోల్ చేయడానికి గుట్టలను, బండలను సాఫ్ చేస్తూ ఈ లింక్ రోడ్లను ఏర్పాటు చేసిన్రు. ప్రస్తుతం సిటీలో 33కి పైగా లింక్ రోడ్లున్నయ్. ఈ రోడ్ల పక్కనే గుట్టలు, చెట్లు, చెరువులు ఉన్నయ్. ఇంకేముంది సిటిజన్లకు నయా రీఫ్రెష్​మెంట్​ అడ్డాలుగా ఇవి మారిపోయినయ్. జీహెచ్ఎంసీ కూడా ఆ రోడ్ల పక్కన ఉన్న పార్కులు, లేక్​లకు లైటింగ్​లు పెట్టి మరింత అందంగా ముస్తాబు చేస్తోంది. జనాలు ఆ రూట్లలో పోయేటందుకు ఎక్కువ ఇంట్రెస్ట్  చూపిస్తున్నరు.  ఫొటోషూట్లు కూడా చేసుకుంటుకున్నారు.   దీంతో ప్రస్తుతం ఆ రూట్లు టూరిస్ట్ స్పాట్లుగా  మారినయ్. 

 ట్రాఫిక్ డైవర్షన్స్ కోసం..

సిటీలో రద్దీ ఏరియాల్లో, ఐటీ కారిడార్ రూట్లలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ రోడ్ల ట్రాఫిక్​ని మళ్లించడానికి ఏర్పాటుచేసినవే ఈ లింక్ రోడ్లు. ఖాజాగూడ, బయో డైవర్సిటీ, రాయదుర్గం, శేరిలింగంపల్లి, మియాపూర్, నిజాంపేట్ ఏరియాల్లో ఈ లింక్ రోడ్లున్నాయి. ట్రాఫిక్, 
పొల్యూషన్ ఎక్కువ లేకపోవడంతో చాలామంది ఈ రూట్లలో వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్తగా వేసిన రోడ్లతో పాటు, అటు ఇటు గుట్టలు, గ్రీనరీ ఉండటంతో లింక్ రోడ్లను సిటీజనం ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు మణికొండ, ఖాజాగూడ వాసులు గచ్చిబౌలి వెళ్లాలంటే  నానక్​రాం గూడ రోడ్ మీదుగా వెళ్లేవారు. ఇప్పుడు ఖాజాగూడ లేక్ పక్క  నుంచి లింక్ రోడ్ వేసి దాన్ని ఈఎస్సీఐ రోడ్​గా చేశారు. దీంతో వాహనదారులు తక్కువ టైమ్​లో  ఈజీగా వెళ్తున్నారు. 

ఇప్పుడు ఇవే విజిటింగ్ స్పాట్లు.. 

ఒకప్పుడు సిటీలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్,  లుంబినీ పార్క్​ల దగ్గర జనాల రద్దీ ఎక్కువగా కనిపించేది. ఫొటో షూట్స్ కూడా జరిగేవి. ప్రస్తుతం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సిటీ శివార్లు, లేక్స్, పార్కు​లను స్పాట్స్ గా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ లింక్ రోడ్లు కూడా టూరిస్ట్ స్పాట్స్​గా మారిపోయాయి.  రీఫ్రెష్ మెంట్​కు సరికొత్త అడ్డాలుగా ఉంటున్నాయి . దీంతో పాటు బల్దియా  అధికారులు ఈ రూట్లలో లైట్లు, పార్కులు, లేక్​ల దగ్గర లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు, వీడియోలు చేసేవారు, ఫొటోషూట్స్ చేసుకునేవారు ఈ స్పాట్లను డిఫరెంట్ కాన్సెప్ట్​ల కోసం వాడుకుంటున్నారు.

వీకెండ్ బెస్ట్ ఆప్షన్

రీసెంట్​గా యూట్యూట్​లో ఖాజాగూడ లేక్ వీడియో చూసి అక్కడికి వెళ్లా.  పార్కు చాలా బాగుంది. వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చుని చూస్తే చుట్టూ కనిపించే కొండలు అట్రాక్ట్ చేస్తాయి.  ఫుట్ పాత్, రోడ్ చాలా నీట్​గా ఉంది. వీకెండ్స్ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేయొచ్చు.
-శివాని, ఫ్యాషన్ డిజైనర్, గచ్చిబౌలి

ట్రాఫిక్ సమస్య తగ్గింది

జూబ్లీహిల్స్, మాదాపూర్ వెళ్లాలంటే ఒకప్పుడు ఫిలింనగర్ రూట్ లేదా గచ్చిబౌలి వైపు నుంచో మొత్తం తిరిగి వెళ్లేవాళ్లం. ఇప్పుడు మణికొండ దర్గా నుంచి మహాప్రస్థానం మీదుగా  కొత్తగా వేసిన లింక్ రోడ్​లో వెళ్తున్నాం. ఈ దారిలో ఒకప్పుడు బండలు, గుట్టలు ఉండేవి. ఇప్పుడు వాటి మధ్యలో వేసిన లింక్ రోడ్ నుంచి వెళ్తుంటే కొత్తగా ఉంది. లింక్ రోడ్ల వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గింది.  టైమ్ కూడా సేవ్ అవుతోంది.
- ఉజ్వల్, ఐటీ ఎంప్లాయ్, మణికొండ