
బషీర్‌బాగ్, వెలుగు: ఓల్డ్ కరెన్సీ కొంటామని నమ్మించి సైబర్ చీటర్స్ ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3.61 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్ పల్లికి చెందిన 57 ఏళ్ల వ్యక్తి ఫేస్ బుక్ లో ఢిల్లీకి చెందిన ఇండియన్ కాయిన్ కంపెనీ పేరుతో ఉన్న యాడ్ చూశాడు. దానిపై క్లిక్ చేయడంతో కంపెనీ ప్రతినిధులమంటూ స్కామర్స్ కాల్ చేశారు. తాము ఓల్డ్ కరెన్సీ కొంటామని చెప్పడంతో.. అతను తన వద్ద ఓల్డ్కాయిన్స్, నోట్లు ఉన్నాయని చెప్పాడు.
వాటిని రూ.95 లక్షలకు కొంటామని స్కామర్స్నమ్మబలికారు. ఆ వ్యక్తి వద్ద ఉన్న కరెన్సీ, ఆధార్‌కార్డు ఫొటోలు తీసుకున్నారు. అనంతరం డాక్యుమెంటేషన్ , డెలివరీ చార్జెస్, జీఎస్టీ, ఫ్లైట్ టికెట్స్, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డబ్బులు చెల్లించాలని చెప్పారు. పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయని ఆశపడిన అతను తన బంధువుల వద్ద అప్పు చేసి, రూ.3,61,847 ను స్కామర్స్అకౌంట్కు ట్రాన్స్ఫర్చేశాడు. తర్వాత ఇంకా డబ్బులు అడుగుతుండటంతో ఇది స్కామ్ అని గ్రహించిన బాధితుడు https://cybercrime.gov.in లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.