హైదరాబాద్లో ప్రాజెక్టుల కోసం ‘ఫారిన్’ నిధుల వేట..రూ.30 వేల కోట్ల సేకరణే లక్ష్యం

హైదరాబాద్లో ప్రాజెక్టుల కోసం ‘ఫారిన్’ నిధుల వేట..రూ.30 వేల కోట్ల సేకరణే లక్ష్యం
  •     విదేశీ బ్యాంకుల లోన్ల కోసం హెచ్ఎండీఏ ప్రయత్నాలు
  •      ఇటీవల చైనాలో అధికారుల పర్యటన  
  •     రూ.30 వేల కోట్ల సేకరణే లక్ష్యం 

హైదరాబాద్​సిటీ, వెలుగు:  హైదరాబాద్​లో చేపడుతున్న ప్రాజెక్టులకు అవసరసమైన నిధులను విదేశీ బ్యాంకుల నుంచి సమకూర్చుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ప్రస్తుత ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు అవసరం అవుతుండడం, అవి సంస్థ దగ్గర లేకపోవడంతో పలు ఫారిన్​బ్యాంకులను అధికారులు సంప్రదిస్తున్నారు. దేశీయ బ్యాంకులు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుండడంతో తక్కువ వడ్డీతో పాటు ఎక్కువ కాల పరిమితితో లోన్లు ఇచ్చే విదేశీ బ్యాంకులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. 

ఇప్పటికే  చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్, ఆసియా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్​ (ఏఐఐబి) వంటి సంస్థలతో అధికారులు టచ్​లో ఉన్నారు. ఇటీవలే హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్​రవీందర్ నేతృత్వంలో అధికారుల బృందం చైనాలో పర్యటించి వచ్చింది. అక్కడ కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అధ్యయనం  చేయడంతో చైనా బ్యాంకులతో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. 

రూ. 30 వేల కోట్ల కోసం..

గ్రేటర్​పరిధిలో ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.30 వేల కోట్లు రుణంగా తీసుకోవాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఇందులో మూసీ రివర్ ఫ్రంట్​డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ప్యారడైజ్​నుంచి బోయిన్​ డెయిరీఫామ్​వరకు ఒక ఎలివేటెడ్​కారిడార్​,.. ప్యారడైజ్​నుంచి శామీర్​ పేట్​వరకు మరో ఎలివేటెడ్​కారిడార్​ నిర్మాణాలు ఉన్నాయి. సిటీలో పోలీస్​కమాండ్​కంట్రోల్​సెంటర్​నుంచి కొండాపూర్​లోని శిల్పా లేఅవుట్​వరకు మరో ఎలివేటెడ్​కారిడార్​నిర్మించాల్సి ఉన్నది. అలాగే ఓఆర్ఆర్​పై రావిర్యాల మీదుగా ఆమన్​గల్​ వరకూ ఫ్యూచర్ సిటీని లింక్​చేస్తూ ఒక గ్రీన్​ఫీల్డ్​రోడ్డు, ఓఆర్ఆర్​పై బుద్వేల్​మీదుగా పరిగి వరకూ మరో గ్రీన్​ఫీల్డ్​రోడ్​నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. వీటన్నింటినీ పూర్తి చేయాలంటే ఎంత లేదన్నా రూ. 30వేల కోట్లు కావాల్సి ఉంటుంది. అంత డబ్బు హెచ్ఎండీఏ దగ్గర లేకపోవడంతో లోన్​రూపంలో తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. 

విదేశీ బ్యాంకులయితే 4 శాతం వడ్డీతో పాటు ఎక్కువ కాల పరిమితికి రుణంగా ఇచ్చే అవకాశం ఉంటుందని, అందుకే అటు వైపు మొగ్గు చూపుతున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో చైనా బ్యాంకు నుంచి లోన్​పొందేందుకు కేంద్ర ఆర్ధిక శాఖకు ప్రతిపాదనలు పంపినా అది ముందుకు సాగలేదు. తాజాగా చైనా పర్యటనలో ఏషియన్​ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ఇన్​వెస్ట్​వెంట్​బ్యాంక్​ (ఏఐఐబి) నుంచి లోన్​పొందేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో వంద దేశాల ఫండ్స్​ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.