
హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో పనులు కీలక దశకు చేరుకున్నాయి.. ఓల్డ్ సిటీ మెట్రో పనులు ప్రారంభించటానికి అవసరమైన రైట్ ఆఫ్ వే నిర్మించే పనులు కీలక దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడున్నర కిలోమీటర్ల ఈ కారిడార్ లో ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి చేశారు అధికారులు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు విస్తరణ పనులు శరవేగంగా చేపట్టామని.. వీలైనంత త్వరగా పాత ఓల్డ్ సిటీ ప్రజల చిరకాల స్వప్నం మెట్రో రైలును పట్టాలెక్కించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
మొదట ప్రభావిత ఆస్తుల సంఖ్య 1100గా గుర్తించినప్పటికీ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అమలు చేయడం వల్ల వాటి సంఖ్య ఇప్పుడు 886కి చేరిందని అన్నారు. ఇప్పటికే దాదాపు 550 పైగా ఆస్తుల కూల్చివేతలు పూర్తవుతున్నాయని, మిగతా ఆస్తులను కూడా విస్తరణకు అనువుగా కూల్చివేసే పనులు జరుగుతున్నట్టు తెలిపారు మెట్రో ఎండీ.ప్రభావిత ఆస్తులకు సంబంధించిన యజమానులకు ఇప్పటి వరకు రు.433 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్టు చెప్పారు. మధ్యలో వర్షాలు, అనేక పండుగలు, మొహర్రం వంటి సందర్భాలలో కూడా స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రభావిత ఆస్తులకు సంబంధించిన సంక్లిష్టమైన విద్యుత్ కేబుళ్లు కూల్చివేత, విస్తరణ పనులకు సవాళ్లుగా నిలిచినప్పటికీ, వాటిన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్తున్నామని ఎండీ చెప్పారు.మెట్రో స్తంభాలు, స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన సన్నాహక పనులు ముమ్మరంగా జరుగుతున్నట్టు ఆయన వెల్లడించారు.ఇందుకు ప్రధానంగా అవసరమైన డీజీపీఎస్ సర్వే, భూగర్భంలో వివిధ యుటిలిటీలు, భూ సామర్థ్యం, మట్టి పరీక్షలు, అలైన్మెంట్ వెంబడి ఉన్న సున్నితమైన కట్టడాల పరిరక్షణ, ఈ నాలుగు అంశాలపై ఇప్పుడు దృష్టి పెట్టామని, వీటన్నిటితో ప్రాజెక్టు నిర్మాణం సజావుగా జరిగేలా కృషి చేస్తున్నామని మెట్రో ఎండీ స్పష్టం చేశారు.
సాధారణ పరికరాలను ఉపయోగించే సాంప్రదాయ సర్వేకు భిన్నంగా ఖచ్చితత్వం ఇంకా పెంచేలా 'డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్' (డీజీపీఎస్) సర్వే విధానాన్ని ఉపయోగిస్తున్నట్టు ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డీ తెలిపారు. ఇది అధునాతన సర్వే వ్యవస్థ. వేగవంతమైన బహుముఖ కోణంలో డిజిటల్ రూపంలో ఫలితాలను చూపెడుతుందని అయన అన్నారు. డీజీపీఎస్ నుండి పొందిన డేటాను ఓల్డ్ సిటీలో గతంలో చేసిన డ్రోన్ సర్వే నుండి పొందిన డేటాతో అనుసంధానించడం జరిగిందని, ఈ కసరత్తు వల్ల ప్రాజెక్ట్ అమలు మరింత వేగవంతం అవుతుందని మెట్రో ఎండీ తెలిపారు.
మొత్తం 7.5 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొన్ని భాగాలుగా విభజించి అవసరమైన ప్రదేశాలలో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని మెట్రో ఎండీ అన్నారు. హై-ప్రెసిషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ (GNSS) రిసీవర్‌లను, నిర్దేశిత ప్రదేశాలను ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు.
ఉపగ్రహాల నెట్ వర్క్ ద్వారా పొందిన సిగ్నళ్ల ఆధారంగా ఈ స్థానాలను ఖచ్చితంగా గుర్తిస్తామని, ఇవి మెట్రో పనుల సర్వే, మ్యాపింగ్ లో కీలకమైనవి అవుతాయని ఆయన చెప్పారు. ఇక మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసే ప్రదేశాల వద్ద భూగర్భంలో వచ్చే అడ్డంకులను అంచనా వేసి వాటిని వేరే చోటకు మళ్లించడం మెట్రో ప్రాజెక్ట్ లో చాలా కీలకమైన పని అని ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
రోడ్లు చాలా పురాతనమైనవి కావడం వల్ల, రోడ్డు కింద అనేక నీటి సరఫరా లైన్లు, మురుగునీరు, వరద నీరు, విద్యుత్, టెలికాం లైన్లు వంటి యుటిలిటీలు ఉన్నాయన్నారు. ప్లాన్ ప్రకారం రహదారిని 100 అడుగులకు విస్తరించి, ప్రభావిత ఆస్తులను కూల్చివేస్తున్నామని ఆయన తెలిపారు.మెట్రో స్తంభాల పునాదులను వేసే ముందు భూమి కింద ఉన్న యుటిలిటీలను పక్కకు మళ్లించడంలో హైదరాబాద్ జల మండలి, జీహెచ్ఎంసి, టీజీఎస్పీడీసీఎల్, బీఎస్ఎన్ఎల్ ఇతర ఏజెన్సీల సహకారం కోరామని చెప్పారు.
ఇక ప్రాజెక్టు చేపట్టే ప్రదేశంలో ఎలాంటి మట్టి ఉంది, అది ఎంత బలంగా ఉంది, అది మెట్రో కట్టడాల బరువును ఎంతవరకు తట్టుకోగలదు, భూగర్భంలో నీరు ఊరుతున్న పరిస్థితి ఉందా మొదలైన వాటిని తెలుసుకోవడానికి భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మెట్రో ఎండీ వివరించారు. మెట్రో అలైన్‌మెంట్‌కు దారిలో చాలా సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి, వీటిని మెట్రో నిర్మాణ సమయంలో, తర్వాత కూడా సురక్షితంగా ఉండడం చాలా ముఖ్యమైన అంశం.
ఈ నిర్మాణాలను ప్రణాళిక దశలోనే గుర్తించి తదనుగుణంగా అలైన్‌మెంట్ చేయడం జరిగింది. ఈ అలైన్‌మెంట్ ప్రకారం పిల్లర్ల స్థానాలను గుర్తించడం జరుగుతుందని.. అందు వల్ల మెట్రో పనులను సజావుగా చేపట్టడానికి నిర్దేశిత నిడివిలో 100 మీటర్లకు ఒకటి చొప్పున మైలు రాళ్ళను ఏర్పాటు చేస్తున్నామని ఎండీ వివరించారు. మెట్రో పనులు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిరంతరాయంగా జరిగేందుకు ముందస్తు సాంకేతికపరమైన అన్ని చర్యలను చేపట్టామని ఈ కీలక దశ దాటిన వెంటనే మెట్రో రైల్ నిర్మాణాలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.