హైదరాబాద్‌‌లో కుళ్లిన మటన్, చికెన్, స్వీట్లు, నెయ్యి, పచ్చళ్లు ఇంత విచ్చలవిడిగా అమ్ముతున్నారేంటయ్యా..!

హైదరాబాద్‌‌లో కుళ్లిన మటన్, చికెన్, స్వీట్లు, నెయ్యి, పచ్చళ్లు ఇంత విచ్చలవిడిగా అమ్ముతున్నారేంటయ్యా..!
  • నిద్రావస్థలో ఫుడ్ సేఫ్టీ విభాగం, పోలీసులతో కలిసి రైడ్స్​చేస్తున్న టాస్క్​ఫోర్స్​
  • జాయింట్ ఇన్​స్పెక్షన్​కు వెళ్లని ‘ఆహార కల్తీ నిరోధక శాఖ’.. చివరిలో వెళ్లి శాంపిల్స్ సేకరణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహా నగరంలో కల్తీ ఆహార దందా రోజురోజుకీ పెరుగుతోంది. పాలు, నెయ్యి, పెరుగు, స్వీట్లు, టీపొడి, వంట నూనెలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఇలా ప్రతీది కల్తీమయమవుతున్నాయి. ఆదివారం నాన్​వెజ్​ప్రియులు తినే మటన్, చికెన్​నూ వదలడం లేదు. నెలల తరబడి  ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని ఫ్రెష్‌‌గా అమ్ముతున్నా అడిగే నాథుడు లేడు. 

కల్తీ దందాను అరికట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్​మెంట్ మాత్రం పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ, ఫుడ్​సేఫ్టీతో సంబంధం లేకున్నా..నిత్యం లా అండ్​ఆర్డర్, ప్రజాప్రతినిధుల రక్షణలో తలమునకలై ఉంటున్న పోలీసులు టాస్క్‌‌ఫోర్స్‌‌తో కలిసి వరుస దాడుల చేస్తూ కల్తీ మాఫియా నడ్డి విరుస్తున్నారు. ఫుడ్​సేఫ్టీ అధికారులు దాడుల సమయంలో పాల్గొనకపోయినా, చివర్లో మాత్రమే వెళ్లి నమూనాలు సేకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పండుగల వేళా పని చేయరా ?
పండుగల సమయంలో కల్తీకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.  ముఖ్యంగా రంజాన్ సీజన్​లో  మటన్, చికెన్​హలీంను నగరవాసులంతా ఎంతో ఇష్టంగా తింటారు. హలీం తయారీ కేంద్రాల్లో ఇప్పటివరకు ఫుడ్​సేఫ్టీ డిపార్ట్​మెంట్​తనిఖీలు చేసిందే లేదు.  ఎలాంటి  మాంసం వాడుతున్నారు, మసాలాలు, ఇతర  ఆహార పదార్థాలు నాణ్యత ఉన్నవా లేవా? ఎలా తయారు చేస్తున్నారు? శుభ్రత పాటిస్తున్నారా ? వంటి అంశాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు.  ఏది వండి పెడితే దాన్నే తిని సరిపెట్టుకోవాల్సి వస్తున్నది.

కుళ్లిన మటన్, చికెన్​, స్వీట్లు, నెయ్యి, పచ్చళ్లు
మార్చి10న మంగళ్ హాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కుళ్లిపోయిన 300 కిలోల మటన్‌‌ను టాస్క్​ఫోర్స్​పోలీసులు లోకల్​పోలీసులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యాపారం చేసే వ్యక్తి కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల నుంచి చాలా తక్కువ ధరకు కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసాన్ని తీసుకొచ్చి నెలల తరబడి డీప్ ఫ్రీజర్లు, మురికి నీళ్లున్న ప్లాస్టిక్ టబ్‌‌లలో నిల్వ ఉంచుతున్నాడు. 

దుర్వాసన రాకుండా కెమికల్స్​కలుపుతున్నాడు. తలకాయ, లివర్, బోటి, కాళ్లను బార్లు, వైన్స్ ల్లోని పర్మిట్ రూమ్ ల కు సప్లై చేస్తున్నాడు. మూడు నెలల కిందటి మటన్​స్టోర్ చేసి అమ్ముతున్నాడు. తాజాగా మంగళవారం పార్సీగుట్టలో కూడా ఓ చికెన్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 800 కిలోల కుళ్లిన చికెన్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడ కూడా పోలీసులు రైడ్స్​ చేస్తే జీహెచ్ఎంసీ వెటర్ననీ విభాగం అధికారులు చివరలో వెళ్లి హడావిడి చేశారు. నాలుగు రోజుల కింద మైలార్ దేవ్‌‌పల్లిలో ఎక్స్​పైరీ అయిన స్వీట్లను, అంబర్‌‌పేట్‌‌లో కెమికల్స్​తో తయారు చేసిన 250 కిలోల కల్తీ పెరుగు, మరికొన్ని చోట్ల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ను పట్టుకున్నారు. 

గురువారం కుల్సుంపురాలో కుళ్లిపోయిన కూరగాయల పచ్చళ్లను లోకల్​ పోలీసులతో కలిసి టాస్క్​ఫోర్స్​పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాస్ట్లో శాంపిల్స్​సేకరించడానికి మాత్రం ఫుడ్​సేఫ్టీ వింగ్​అధికారులు వచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో కల్తీ ఆహారాన్ని నియంత్రించేందుకు గురువారం హెచ్-ఫాస్ట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.

సిబ్బంది కొరత అంటున్న అధికారులు
ఫుడ్ సేఫ్టీ అధికారుల ప్రకారం, ఇన్ఫార్మర్ వ్యవస్థ లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగా దాడులు చేయడం కష్టమవుతోందని చెబుతున్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 60 మంది అధికారుల అవసరం ఉండగా, ప్రస్తుతం 22 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ మూడు కార్పొరేషన్లలో కలిపి 12 మంది గెజిటెడ్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లకు ఐదుగురే ఉన్నారు. దీంతో ఒకే అధికారి పలు సర్కిల్స్‌‌ను పర్యవేక్షించాల్సి వస్తోంది.

కఠిన శిక్షలు అవసరం..
గత పక్షం రోజులుగా నగరంలో ఏదో ఒకచోట కల్తీ ఫుడ్​ను పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. వీరిపై క్రిమినల్​కేసులు నమోదు చేస్తున్నా వారిలో భయం ఉండడం లేదు. బీఎన్​ఎస్​, ఫుడ్​సేఫ్టీ యాక్ట్​ ప్రకారం కల్తీ ఆహారం లేదా డ్రింక్స్​అమ్మితే కనీసం 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. కేసు తీవ్రంగా ఉంటే మాత్రమే అంటే ప్రాణాపాయం కలగడం లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్టు తేలితేనే ఏడేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష వేస్తారు. 

కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార కల్తీ వల్ల అనారోగ్యానికి గురైనట్టు గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఆహార కల్తీ వల్లే అనారోగ్యానికి గురైనట్టు చాలామందికి తెలియడం లేదు. దీంతో నిందితులకు కఠిన శిక్షలు పడడం లేదు. అందుకే ఆహార కల్తీ చేసినట్టు రుజువైతేనే యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని పలువురు డిమాండ్​చేస్తున్నారు.