
హైదరాబాద్, వెలుగు: సిటీలో హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న పార్కులన్నింటిలో ఇకపై కామన్ టికెట్లు రానున్నాయి. ఇందుకోసం హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి పార్కులలో మాన్యువల్ విధానం ద్వారా సందర్శకులకు టికెట్ ఇచ్చేవారు. ఈ క్రమంలో సిటీలో సాగర్ చుట్టూ ఉన్న పార్కులకు వస్తున్న సందర్శకుల కోసం అన్ని పార్కులకు కలిపి ఒకే టికెట్ సిస్టమ్ తీసుకు రావాలని భావించింది. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన హెచ్ఎండీఏ కామన్ టికెట్ అమలుకు సన్నద్ధమైంది. దీనిలో భాగంగా తొలుత పార్కులలోని మాన్యువల్ టికెట్లకు స్వస్తి చెప్పనుంది. ఇకపై కంప్యూటరైజ్డ్ టికెట్లను జారీ చేయనుంది. త్వరలోనే పార్కులన్నింటినీ ఆన్లైన్ చేయనున్నట్టు హెచ్ఎంఏడీ కార్యదర్శి రాంకిషన్ చెప్పార. ఇదివరకే కామన్ టికెట్లు అందుబాటులోకి తేవాల్సి ఉన్నప్పటికీ.. హెచ్ఎండీఏ పలు విభాగాలు వివిధ పనుల్లో నిమగ్నమై ఉండడంతో కొంత ఆలస్యమైందని కార్యదర్శి రాంకిషన్ తెలిపారు.
టూరిస్టులకు లాభం
సాగర్ తీరాన ఉన్న పార్కుల సందర్శనకు వచ్చేవారంతా కామన్ టికెట్‌తో లుంబినీ, సంజీవయ్య, ఎన్టీఆర్ గార్డెన్లను చుట్టివేయొచ్చు. అన్ని పార్కులు తిరగలేని వారు మామూలుగానే పార్కు వద్ద టికెట్ తీసుకునే వీలుంటుంది. చాలావరకు సిటీకి వస్తున్న పర్యాటకులు ఇక్కడ ఉన్న అన్ని పార్కులను చూడాలనుకుంటున్నారు. వెళ్లిన చోట టికెట్ కోసం క్యూలో నిల్చోవడం.. సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. సదరు విషయాన్ని గుర్తించిన హెచ్ఎండీఏ పార్కులన్నీంటికి కలిపి ఒకే కామన్ టికెట్ విధానం అమలు చేయనుంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ విధానంతో సందర్శకులకు మేలు జరుగుతుందని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.