హైదరాబాద్లో 115 రూపాయలు దాటిన లీటర్ పెట్రోల్.. దేశంలోనే ఏపీ టాప్.. ఆంధ్రాలో లీటర్ పెట్రోల్ ఎంతంటే..

హైదరాబాద్లో 115 రూపాయలు దాటిన లీటర్ పెట్రోల్.. దేశంలోనే ఏపీ టాప్.. ఆంధ్రాలో లీటర్ పెట్రోల్ ఎంతంటే..

హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సోమవారం మరోసారి పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా.. లీటర్కు యావరేజ్గా 2 రూపాయల 80 పైసలు పెరిగింది.

హైదరాబాద్ సిటీలో లీటర్ పెట్రోల్ ధర.. ఈ పెంపు తర్వాత 115 రూపాయల 62 పైసలకు చేరింది. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర 103 రూపాయల 76 పైసలకు పెరిగింది. దేశంలో అత్యధికంగా.. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులు చుక్కలు చూపిస్తున్నాయి.

సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగో సారి పెరిగాక.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 118 రూపాయల 28 పైసలు, లీటర్ డీజిల్ ధర 105 రూపాయల 91 పైసలకు చేరడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో వాహనదారులు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్రోల్, డీజిల్ కోసం చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 116 రూపాయల 39 పైసలు, లీటర్ డీజిల్ ధర 104 రూపాయల 11 పైసలకు చేరింది. ఈ పెరిగిన ధరలు సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.

పశ్చిమాసియా యుద్ధం, ఇంధన కొరత, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో నష్టాన్ని పూడ్చుకునేందుకని ఆయిల్ కంపెనీలు మే 15వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులకోసారి ధరలను పెంచాయి. సోమవారం నాటి పెంపుతో రెండు వారాల్లోనే ఇంధన ధరలు నాలుగోసారి పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.