పద్మారావునగర్: ‘బ్రూస్ లీ’ గ్యాంగ్ అరెస్ట్‌‌

పద్మారావునగర్: ‘బ్రూస్ లీ’ గ్యాంగ్ అరెస్ట్‌‌

పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌‌లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు, బ్రూస్ లీ గ్యాంగ్‌‌ను చిలకలగూడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌‌ ప్రధాన సూత్రధారి కర్నాటకకు చెందిన దార్ల నెహెమ్యా అలియాస్ బ్రూస్ లీపై మూడు రాష్ట్రాల్లో 65 కేసులు ఉన్నాయి. చంచల్‌‌గూడ జైల్లో ఉన్నప్పుడే తోటి ఖైదీలతో గ్యాంగ్‌‌ ఏర్పాటు చేసిన నెహెమ్యా.. జూన్‌‌లో విడుదలయ్యాడు. ఆ తర్వాత వరుసగా అల్వాల్, మీర్‌‌పేట్, అనంతపురంలో దోపిడీలకు పాల్పడ్డాడు. మంగళవారం బోయిగూడ ఫ్లోరా హోటల్ వద్ద రాజ్ కుమార్ అనే కార్మికుడిపై దాడి చేసిన గ్యాంగ్‌‌.. మొబైల్, నగదు దోచుకుంది. కేసును విచారించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ముఠాను పట్టుకున్నారు. 

బ్రూస్ లీతో పాటు దారా అశ్వంత్, నితిన్ ఫ్రాన్సిస్‌‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించగా, ఒక బాలుడిని జునైవల్‌‌ బోర్డు ముందు హాజరుపరిచారు. నిందితుల నుంచి రూ. 2.25 లక్షల నగదు, మొబైల్, స్కూటర్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్‌‌హెచ్‌‌వో  వి.రామకృష్ణ, డిటెక్టివ్ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ ఎల్.మధుబాబు బృందాన్ని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఏడీసీపీ జె.నరసయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డి అభినందించారు.