ఐటీ కారిడార్, టీ-హబ్, ఐకియా ఏరియాకు నైట్ టైం వెళ్లే పబ్లిక్కు బిగ్ రిలీఫ్ !

ఐటీ కారిడార్, టీ-హబ్, ఐకియా ఏరియాకు నైట్ టైం వెళ్లే పబ్లిక్కు బిగ్ రిలీఫ్ !

హైదరాబాద్: ఐటీ కారిడార్, టీ-హబ్ పరిసర ప్రాంతాల్లో వీకెండ్స్‌లో బైక్ స్టంట్లు, ప్రమాదకర రేసింగ్‌లతో హల్‌చల్ చేస్తున్న పోకిరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రీల్స్ పిచ్చితో రోడ్లపై ప్రాణసంకటంగా మారుతున్న వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, కఠిన చర్యలు చేపట్టారు. ఈ డ్రైవ్‌కు సంబంధించిన వివరాలను కూకట్‌పల్లి డీసీపీ రితి రాజ్ మీడియాకు వెల్లడించారు.

ఐటీ కారిడార్, టీ-హబ్, ఐకియా (IKEA) పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా అర్ధరాత్రి, వీకెండ్స్ సమయంలో యువత ప్రమాదకర రీతిలో బైక్ స్టంట్లు, రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. దీనివల్ల స్థానిక నివాసితులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలగడమే కాకుండా, సాధారణ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. పైగా, అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల విధులకు కూడా కొందరు పోకిరీలు ఆటంకం కలిగిస్తున్నారు.

తాజా డ్రైవ్‌లో భాగంగా ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుండి రేసింగ్‌కు ఉపయోగిస్తున్న 5 బైక్‌లను, ఒక కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్ చేసి, వ్యూస్ సంపాదించడం కోసమే సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత ఇక్కడికి వస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

►ALSO READ | అధికారం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తాడు... అందులో భాగమే ఫోన్ ట్యాపింగ్:ఎంపీ చామల కిరణ్ కుమార్ 

ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తోటి యువతను తప్పుదోవ పట్టిస్తున్న 35 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు ప్రత్యేకంగా గుర్తించి ఖాతాల నిర్వాహకులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. పట్టుబడిన నిందితులపై కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు మాత్రమే కాకుండా.. భారతీయ న్యాయ సంహిత (BNS), మోటార్ వాహనాల చట్టం (MV Act) 1988, మరియు ఐటీ యాక్ట్ 2000లోని వివిధ కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇకపై ఐటీ కారిడార్ పరిధిలో బైక్ రేసర్లపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు డ్రోన్ కెమెరాలను రంగంలోకి దించుతున్నట్లు డీసీపీ రితి రాజ్ ప్రకటించారు. రాత్రి వేళల్లో డ్రోన్ల ద్వారా రేసింగ్ స్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తామని హెచ్చరించారు. టీ-హబ్, ఐకియా, ఐటీ క్యాడర్ పరిసరాల్లో రేసింగ్‌లు, స్టంట్లకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠిన జైలు శిక్షలు తప్పవని డీసీపీ యువతను, వారి తల్లిదండ్రులను హెచ్చరించారు.