హైదరాబాద్ లో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయి ఆపరేషన్ లో ఈ కాల్పులు జరిగాయి. నాంపల్లి పోలీసులు , యాంటీ డెకయిట్ టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు.
రాత్రి సమయంలో ప్రయాణికులు పడుకున్నప్పుడు వారిపై దాడి చేసి డబ్బులు , సెల్ ఫోన్లు , బంగారు ఆభరణాలు దోచుకుంటున్నట్లు సమాచారంతో నిన్న అర్ధరాత్రి సమయంలో తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. మాంగర్ బస్తికి చెందిన వారిద్దరూ... పోలీసుల పై గొడ్డలితో దాడికి యత్నించారు.
సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల ఫైరింగ్ లో గాయాలకు గురైన రాజు(24) తొడలో బుల్లెట్ కావడంతో తీవ్ర గాయాలపాలైన రాజును పోలీసులు వైద్య చికిత్సల నిమిత్తం రాత్రి 1:10 నిమిషాలకు ఉస్మానియా హాస్పిటల్ ఓపి భవనంలో ఉన్న ఎమర్జెన్సీ వార్డ్ లో వైద్య చికిత్స అందించారు. తొడలో దిగిన బుల్లెట్ ను తొలిగించేందుకు వైద్యులు మైనర్ ఆపరేషన్ థియేటర్ లో చికిత్స అంధించి , బుల్లెట్ ను బయటకు తీశారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఏఎన్ఎస్టీ వార్డ్ కు తరలించారు. ప్రస్తుతం రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో వ్యక్తి అయ్యాన్ ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.