చైనా మాంజా అమ్మినా, కొన్నా అరెస్ట్ చేస్తం: సీపీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చైనా మాంజా అమ్మినా, కొన్నా అరెస్ట్ చేస్తం: సీపీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగరేసిన వాళ్లే బాధ్యులు
  • నెలలోనే 103 కేసులు నమోదు, 143 మంది అరెస్ట్‌‌‌‌‌‌‌‌: సీపీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రూ.1.24 కోట్ల విలువైన  చైనా మాంజా సీజ్ చేసినట్లు వెల్లడి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: చైనా మాంజాతో పతంగులు ఎగరవేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. చైనా మాంజాతో ఎవరికైనా గాయాలైతే పతంగి ఎగరవేసిన వ్యక్తులనే బాధ్యులుగా చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్న బహిరంగ మార్కెట్లు, ఈ-కామర్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లపై నిఘా పెట్టామని వెల్లడించారు. సిటీ పోలీస్‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న చైనా మాంజా వివరాలను సీపీ సజ్జనార్ గురువారం మీడియాకు వివరించారు. 

నెల రోజుల వ్యవధిలో మొత్తం 103 కేసులు నమోదు చేసి 143 మందిని అరెస్టు చేశామని తెలిపారు. వీరి నుంచి రూ.1.24 కోట్ల విలువైన 6,226 చైనీస్ మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 

అక్రమంగా అమ్ముతున్నరు

పర్యావరణానికి, మనుషుల ప్రాణాలకు హాని కలిగించే నైలాన్, సింథటిక్ దారంతో తయారైన చైనా  మాంజాపై రాష్ట్రంలో నిషేధం అమలులో ఉందని సజ్జనార్ తెలిపారు. అయినా అడ్డదారుల్లో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఇండస్ట్రీస్ ఉపయోగ కోసమనే సాకుతో గుజరాత్, ఢిల్లీ, సూరత్, మీరట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తయారైన మాంజాను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారని, తెలంగాణ, ఏపీ  హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి అమ్ముతున్నారని చెప్పారు. సంక్రాంతి టైంలో చైనా మాంజా వందల కోట్ల రూపాయల దందా చేస్తోందని, సాధారణ మాంజా బాబిన్లతో కలిపి బేగంబజార్ సహా పలు మార్కెట్లలో విక్రయిస్తున్నారని సజ్జనార్ వెల్లడించారు. గుర్తించలేనంతగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారని తెలిపారు. గుజరాత్, సూరత్, మీరట్ నుంచి భారీగా చైనా మాంజా వస్తున్నదని సోదాలు జరిపామన్నారు. ప్రత్యేక సోదాలు, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి.. సౌత్ వెస్ట్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 34 కేసులు నమోదు చేశామన్నారు. 46 మందిని అరెస్టు చేసి రూ.65.30 లక్షల విలువైన 3,265 బాబిన్లను సీజ్ చేసినట్లు వివరించారు. హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ వ్యాపారులు, గోదాములు, ఈ-కామర్స్, సోషల్ మీడియా ఆర్డర్లపై నిఘా పెంచినట్టు సీపీ పేర్కొన్నారు. 

పిల్లలకు షాక్ కొట్టే ప్రమాదం

“ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చైనా మాంజా తయారు చేస్తున్నారు. వాటి వల్ల పిల్లలకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరైనా మాంజా విక్రయిస్తే ‘డయల్ 100’ లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555 కి సమాచారం ఇవ్వాలి. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. ఇది మరొకరి ప్రాణానికి ముప్పుగా పరిణమించకూడదు.’’
- వీసీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌