బీఆర్ఎస్‎కు మరో బిగ్ షాక్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‎కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు

బీఆర్ఎస్‎కు మరో బిగ్ షాక్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‎కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మరో కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‎కు హైదరాబాద్ సిటీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ, ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ చీఫ్‎గా ఉన్న సజ్జనార్‎పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈ నోటీసులు జారీ అయ్యాయి.  

ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, వివరాలు వెల్లడించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు. సిట్ చీఫ్ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని.. విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసినట్లు నోటీసులో స్పష్టం చేశారు. సిట్ చీఫ్‌పై ఉన్నాయని పేర్కొన్న 7 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. 

Also Read : అవసరమైతే మళ్లీ పిలుస్తం

ఎఫ్ఐఆర్‎లు, చార్జ్‌షీట్లు, కోర్టు ఆదేశాలు వంటి ఆధారాలు సమర్పించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. గడువులోగా స్పందించకపోతే క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. పరువు నష్టం కేసులు, క్రిమినల్ ఇన్టిమిడేషన్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. చట్ట ప్రకారం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.