- రూ. 7 లక్షల విలువైన సరుకు స్వాధీనం హబీబ్ నగర్
- బ్యూటీ షాప్స్ లో తనిఖీలు ముంబై మీదుగా భాగ్యనగరానికి రవాణా
- ఐదుగురిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్
మెహదీపట్నం/హైదరాబాద్ సిటీ, వెలుగు: పాకిస్తాన్ నుంచి ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా దిగుమతి చేసుకున్న నిషేధిత కాస్మోటిక్స్ ఉత్పత్తులను సిటీ పోలీసులు, సీడీఎస్‌సీఓ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఓల్డ్ సిటీలోని కొన్ని బ్యూటీ షాప్స్, మెడికల్ షాపుల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. రాజేంద్రనగర్ జోన్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ బృందం, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఆఫీసర్లతో కలిసి నాంపల్లి, హబీబ్ నగర్‌లోని బ్యూటీ లేడీస్ ఎంపోరియం, బ్యూటీ క్వీన్ షాప్, ఎస్ జే మెడికల్ షాప్, సంతోష్‌నగర్‌లోని మదీనా కాస్మోటిక్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో గోరీ, చాందినీ, ఫైజ్, నావియా, పార్లీ గోల్డీ, అనీజా, నూర్ గోల్డ్, అర్జూ, సందల్, ఫేస్ ఫ్రెష్, ఫక్రా గోల్డ్, స్టిల్‌మాన్స్, గోల్డెన్ పెర్ల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్కిన్ వైటనింగ్ క్రీములు, సబ్బులు , సీరమ్‌లను గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ. 7 లక్షల వరకు ఉంటుందని ప్రకటించారు.
అయిదుగురి అరెస్టు.. సప్లై పై లోతుగా ఎంక్వైరీ..
ఈ ఘటనకు సంబంధించి మొహమ్మద్ ఫజల్, మొహమ్మద్ అయాన్, మొహమ్మద్ రియాజుద్దీన్, సయ్యద్ ఆబిద్ అలీ (ఫార్మాసిస్ట్) సయ్యద్ ఇస్మాయిల్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముంబై సప్లయర్లు వీటిని ఎలా సరఫరా చేస్తున్నారు? రవాణా మార్గాలు, బ్యాంక్ లావాదేవీలు, గోడౌన్లలోని అదనపు నిల్వలు, ఇతర భాగస్వాముల పాత్రపై పోలీసులు లోతుగా ఎంక్వైరీ చేపట్టారు. కాగా, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి, అక్రమంగా దిగుమతి చేసుకున్న క్రీములను పట్టుకున్న రాజేంద్రనగర్ శంషాబాద్ జోన్ అదనపు డీసీపీ కేఎస్ రావు పర్యవేక్షణలోని టాస్క్‌ఫోర్స్ , హబీబ్ నగర్ పోలీసులను హైదరాబాద్‌సిటీ సీపీ సజ్జనార్ప్రత్యేకంగా అభినందించారు. అక్రమ విక్రయాలు, నిల్వలు లేదా రవాణాపై ఏమైనా సమాచారం ఉంటే -112 లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ తనిఖీల్లో సీడీఎస్‌సీఓ జోనల్ ఆఫీస్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు డాక్టర్ శ్రీధర్ మిట్టపల్లి, అంజన్ గౌడ్ పెందెం తదితరులు పాల్గొన్నారు.
