- ఎల్‌నినో ప్రభావమే కారణం
- బేగంపేటలో 36.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సాధారణంగా జులై అంటే వర్షాలు, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. ఎండలు ఏప్రిల్, మే నెలలను తలపించేలా దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నగరంలోని బేగంపేటలో సోమవారం 36.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది జులై నెలలో సాధారణం కంటే 5.2 శాతం ఎక్కువ.
2015 తర్వాత జులైలో నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రతగా ఇది రికార్డు సృష్టించింది. గత రెండు నెలలుగా తెలంగాణ, ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘ఎల్‌నినో సప్రెషన్’ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 16 ఏళ్లలో నాలుగు సార్లు ఎల్‌నినో టైంలోనే హై టెంపరేచర్లు నమోదయ్యాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కడాన్ని ‘ఎల్‌నినో’ అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ అసాధారణ వేడికి ఈ గ్లోబల్ వాతావరణ మార్పే కారణమని నిపుణులు చెబుతున్నారు.
