- మణికొండ మర్రిచెట్టు వద్ద 15 కాలనీల అభినందన సభ
- ఖాజాగూడలో హైడ్రా కాపాడిన పార్కులో మొక్కలు నాటిన స్థానికులు
- బతుకమ్మ కుంట వద్ద మద్దతుగా వాకర్స్ నినాదాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా పేదల బతుకులను ఆగం చేసేందుకు కాదని, ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడుతూ అక్రమార్కులపైనే చర్యలు తీసుకుంటోందని నగరంలోని వివిధ కాలనీలు, బస్తీలకు చెందిన జనాలు బుధవారం మద్దతు ర్యాలీలు తీశారు. ప్లకార్డులు పట్టుకుని హైడ్రా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కొండాపూర్ రాఘవేంద్రకాలనీ, ప్రొఫెసర్స్ కాలనీ, ఖాజాగూడ ప్రశాంతి హిల్స్ ప్లాంటేషన్, నెక్నాంపూర్ విలేజ్, తిరుమల హిల్స్ తో పాటు అంబర్‌పేట బతుకమ్మ కుంట వాకర్స్ ఆధ్యర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
మణికొండ మర్రిచెట్టు వద్ద అభినందన సభ
మణికొండ మర్రి చెట్టువద్ద దాదాపు15 కాలనీల వారు ర్యాలీ నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీలో రూ.వెయ్యి కోట్లకు పైగా విలువైన పార్కులను కాపాడి ప్రాణవాయువును అందించారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నెక్నాంపూర్ విలేజ్, తిరుమల హిల్స్ నుంచి చిన్నా పెద్ద వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఖాజాగూడ ప్రశాంతి హిల్స్‌లో హైడ్రా కాపాడిన పార్కుల్లో బుధవారం స్థానికులు మొక్కలు నాటారు. కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాలనీలో 4300 గజాల ప్రభుత్వ భూమిని కాపాడారంటూ ర్యాలీ నిర్వహించారు.
రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కును కాపాడినందుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. అంబర్ పేటలోని బతుకమ్మ కుంట వద్ద వాకర్స్ హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేశారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం హైడ్రాని వ్యతిరేకిస్తున్నారని, హైడ్రా పేదల ఇండ్లను కూల్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేదలకు అన్యాయం చేయడం లేదని, హైడ్రా అంటే బడాబాబులు, కబ్జారాయుళ్లకు భయమన్నారు. హైడ్రా లేకుంటే పార్కులు, చెరువులు కబ్జాలు కాకుండా చూడగలమా అని ప్రశ్నించారు.
దుష్ప్రచారం వద్దు..
హైడ్రాపై దుష్ప్రచారం తగదని హితవు పలికారు. ఇటీవల పాతబస్తీ చాంద్రాయణగుట్ట హఫీజ్ బాబా నగర్ లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని, రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటికే ఆ దారిలో ఉన్న భవనాలకు నష్టపరిహారం కూడా చెల్లించిందని, రోడ్డు విస్తరణతో పాటు నాలా పనుల వల్ల అర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ ను జీహెచ్ఎంసీ తొలగించిందని, దీనిని కూడా హైడ్రా పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడాన్ని పలువురు ఖండించారు.హైడ్రాకు మేమంతా అండగా ఉన్నామన్నారు.
టార్చ్ లైట్లేసి హైడ్రాకు జైకొట్టిన ప్రజలు
మణికొండ వెంకటేశ్వర కాలనీలో రోడ్డు ఆక్రమణలను హైడ్రా తొలగించి నిర్మాణానికి లైన్‌క్లియర్ చేయడంతో పరిసర కాలనీల ప్రజలు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. ఆక్రమణలు తొలగించిన చోట కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు మీదకు బుధవారం సాయంత్రం ర్యాలీగా వచ్చి సెల్ ఫోన్ల టార్చ్ వేసి కృతజ్ఞతలు తెలిపారు. వేంకటేశ్వర కాలనీ నుంచి తారామతి బారాదరికి రోడ్డు లేకుండా పోయింది.
9 కిలోమీటర్ల దూరంలో 2 కిలోమీటర్ల మేర ఆటంకాలు ఏర్పడ్డాయి. మధ్యలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు వేయకుండా కొంతమంది అడ్డు పడుతున్నారని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి విచారించి ఆక్రమణలను హైడ్రా తొలగించింది. దీంతో జీహెచ్ఎంసీ రోడ్డు వేయడం మొదలు పెట్టింది. 60 అడుగుల రోడ్డు కు లైన్ క్లియర్ అవ్వడంతో స్థానికంగా ఉన్న నివాసితులు బుధవారం థాంక్స్ టు హైడ్రా అని నినాదాలు చేశారు.
