హిందీ ప్రచార సభ ప్రాపర్టీ సీజ్

హిందీ ప్రచార సభ ప్రాపర్టీ సీజ్

బషీర్​బాగ్, వెలుగు: నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఉన్న హిందీ ప్రచార సభ భవనంలోని నాలుగో అంతస్తును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణ భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం అబిడ్స్ ఏసీపీ ప్రవీన్ కుమార్, సీఐ పరశురామ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆర్డీవో, తహసీల్దారు భవనాన్ని సీజ్ చేశారు. గత నెల 24న బచ్చాస్ అగ్ని ప్రమాదంలో 5 మంది మృతి చెందిన భవనం హిందీ ప్రచార సభకు చెందినదే. ట్రస్టు సభ్యులు లీజు పేరుతో భూమిని అక్రమంగా బిల్డర్​కు విక్రయించినట్లు విచారణలో తేలింది.

బిల్డరు నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనం నిర్మించి, అవినీతి అధికారుల సహకారంతో ఫర్నిచర్ దుకాణ యజమానికి విక్రయించినట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదంలో జరిగిన దర్యాప్తులో హిందీ ప్రచార సభలో అక్రమాలు, అవినీతి బయటపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. హిందీ ప్రచార సభ భవనంలోని నాలుగో అంతస్తు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సీజ్ చేసినట్లు ఆర్డీవో రామకృష్ణ స్పష్టం చేశారు.