- 900 నడిపామన్న అధికారులు
- ఎక్కడా కనబడడం లేదన్న ప్యాసింజర్లు
- మెట్రో, ఎంఎంటీఎస్, ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు ..
హైదరాబాద్ సిటీ, వెలుగు: రెండో రోజు ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజాము నుంచే డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు, జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయగా స్వల్ప వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. గురువారం నగరంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా 900 బస్సులు నడిపినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఇందులో 450 ఎలక్ట్రిక్ బస్సులు, 300 వరకు అద్దె బస్సులు, 50 సొంత బస్సులు ఉన్నాయి. కాగా, సిటీలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆఫీసర్లు చెప్తుండగా, ప్యాసింజర్లు మాత్రం రోడ్లపై బస్సులే కనిపించడం లేదని చెప్తున్నారు. కొన్ని మెయిన్రూట్లలతో తప్పితే చాలా ప్రాంతాలకు బస్సులు వెళ్లడం లేదని ఆరోపించారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ప్రైవేట్వాహనాలను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. చాలా మంది మెట్రోను ఆశ్రయించడంతో ఆ రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి.
కొనసాగిన ఆందోళనలు
దిల్ సుఖ్ నగర్ డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దీనికి జేఏసీ లీడర్అశ్వత్థామరెడ్డి హాజరై మాట్లాడారు. తమ సమ్మెకు ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తమ సమ్మెలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని, పూర్తిగా కార్మికుల పోరాటమని స్పష్టం చేశారు. కాగా, సమ్మెకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. రాణిగంజ్, కంటోన్మెంట్, పికెట్డిపోల వద్ద ఆర్టీసీ జేఏసీ లీడర్నగేశ్పటేల్ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఎక్కడెక్కడ ఎన్ని బస్సులు నడిచాయంటే
రాణిగంజ్డిపోలో 149 బస్సులు ఉండగా105 బస్సులు, కంటోన్మెంట్ లో 188 బస్సులకు 124, పికెట్డిపోలో 85 బస్సులుండగా ఆరు, ఇబ్రహీంపట్నంలో 130 బస్సులకు 50, తాండూరు బస్ డిపోలో 100 బస్సులకు 32, వికారాబాద్ డిపోలో 67 బస్సులకు 27 బస్సులు నడిచాయి. రోజూ డిపో ఆదాయం రూ. 12 లక్షలుండగా నాలుగో వంతుకు పడిపోయింది. గురువారం ఇక్కడి సమ్మెకు వికారాబాద్మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మద్దతు తెలిపారు.
పరిగి డిపోలో 78 బస్సులుండగా 35 బస్సులు నడిచాయి. రోజూ డిపోకు రూ. 15 లక్షల ఆదాయం వచ్చేది కాగా, గురువారం 30 శాతం మాత్రమే వచ్చింది. కుషాయిగూడలో 155 బస్సులకు 14 బస్సులు నడిచాయి. వీరి సమ్మెకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు పలికారు. మెహిదీపట్నంలో 160 బస్సులుండగా 31 బస్సులు నడిచాయి. రోజూ రూ. 35 లక్షల వరకు ఆదాయం వచ్చేది.
బుధవారం మొత్తానికే ఆదాయం పడిపోగా, గురువారం రూ.2 లక్షలు మాత్రమే వచ్చింది. జీడిమెట్లలో 139 బస్సులకు 11 బస్సులు నడవగా, రెండు రోజుల్లో రూ.50లక్షల వరకూ ఆదాయం పోయింది. దిల్‌సుఖ్‌నగర్ సిటీ డిపోలో115 బస్సులుండగా, 28 , హైదరాబాద్-2 డిపో 94 బస్సులకు 18, బోరబండ నుంచి అన్ని బస్సులు నిలిచిపోయాయి.

