- ఫ్యాక్టరీలను తరలించకుంటే
- పిల్లలకు బంగారు గిన్నెలో విషమిచ్చినట్టే!
- భోపాల్ ట్రాజెడీలాంటి ఘటనలు ఇక్కడ జరగాల్నా?
- ప్రభుత్వ భూములను అగ్గువకు అమ్ముతున్నామన్నది పచ్చి అబద్ధం
- పూర్తి యాజమాన్య హక్కులున్నవారి భూములనే కన్వర్షన్ చేస్తున్నం
- హిల్ట్ పాలసీలో పైసా అవినీతికి ఆస్కారం లేదు.. ప్రభుత్వానికే 10 వేల కోట్ల ఇన్‌కం
- 2023లో జీవో 19తో ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించింది
- గత బీఆర్ఎస్ సర్కారే.. బీజేపీ నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్న
- అక్రమ భూ కేటాయింపులపై విచారణ తప్పదని హెచ్చరిక
- అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: కాలుష్య కాటు నుంచి జంట నగరాల ప్రజలను కాపాడుకునేందుకే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ తీసుకువచ్చామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించి పిల్లలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను అగ్గువకు అమ్ముతున్నామని బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్నఆరోపణలు పచ్చి అబద్ధమని, పూర్తి యాజమాన్య హక్కులున్న పరిశ్రమల భూములనే కన్వర్షన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10,776 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.
మంగళవారం అసెంబ్లీలో ‘హిల్ట్’ పాలసీపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్‌బాబు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. తాము ఆవేశంతోనో, ఆందోళనతోనో నిర్ణయాలు తీసుకోవడం లేదని, 2013లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన రెడ్ అండ్ ఆరెంజ్ జోన్ జీవోను కూడా ప్రాతిపదికగా తీసుకుంటున్నామని వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పాలసీ లేకుండా వివిధ ఇండస్ట్రీలకు జరిగిన ఇష్టారాజ్య భూ కేటాయింపులపై విచారణ జరిపిస్తామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తుచేశారు.
రూ.10 వేల కోట్ల ఆదాయం.. లెక్కలివే
హిల్ట్ పాలసీ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం గాలిలో లెక్కలు వేయలేదని, అత్యంత శాస్త్రీయంగా స్టడీ చేశాకే అంచనాకు వచ్చామని సభకు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.
ఈ పాలసీ పరిధిలో నెట్ ఏరియా సుమారు 4,740 ఎకరాలుగా ఉందన్నారు. హిల్ట్ పాలసీలో 54 శాతం ఏరియా (సుమారు 2,560 ఎకరాలు) ఎస్ఆర్వో రేటులో 30 శాతం చెల్లింపు పరిధిలోకి వస్తాయని, దీంతో ఖజానాకు రూ.4,454 కోట్లు వస్తాయని తెలిపారు. మిగిలిన 2,180 ఎకరాలు ఎస్ఆర్వో రేటులో 50 శాతం చెల్లింపు పరిధిలోకి వస్తాయని, ఇక్కడ ప్రతి ఎకరాకు రూ.2.9 కోట్ల చొప్పున ప్రభుత్వానికి రూ.6,332 కోట్లు వస్తాయని వివరించారు.
ఇలా మొత్తంగా రూ.10,776 కోట్లు హిల్ట్ పాలసీ ద్వారా ప్రభుత్వానికి సమకూరుతాయని అంచనా వేశామన్నారు. సాధారణంగానే టీజీఐఐసీ ద్వారా భూములు కేటాయించిన వెంటనే.. పరిశ్రమలు పెట్టేందుకు ఎవరైతే ముందుకు వస్తారో.. ఆ పారిశ్రామికవేత్తలతో ‘సేల్ కన్సిడరేషన్’ చేసుకుంటామని చెప్పారు. దీంతో వారు ఆ భూములకు పూర్తిస్థాయి యజమానులవుతారని క్లారిటీ ఇచ్చారు.
లీజు ల్యాండ్‌లో ఉన్నవారినైనా, ఫ్రీ హోల్డ్ భూముల్లో ఉన్నవారినైనా.. కాలుష్య కారక పరిశ్రమలు అయితే కచ్చితంగా షిఫ్ట్ చేస్తామని మంత్రి తేల్చిచెప్పారు. ఈ విషయంలో అందరితో చర్చలు జరిపి ముందుకు వెళ్తామని తెలిపారు.
బొల్లారంలోని ఐడీఎల్‌లాంటి ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు కూడా ఈ పాలసీ పరిధిలో ఉంటాయని, వాటిని వదిలిపెడతారనే అనుమానం అక్కర్లేదని అన్నారు.
అలాగే ప్రైవేట్ ఐలా (ఐఏఎల్‌ఏ)లకు కూడా హిల్ట్ వర్తిస్తుందన్నారు. బొల్లారంలోని 140 ఎకరాల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ సొసైటీలో 38 యూనిట్లు పనిచేస్తున్నాయని, వాటిపైనా దృష్టి సారించామన్నారు. కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం కలగదని, లేబర్ చట్టాలన్నీ పక్కాగా అమలవుతాయని భరోసా ఇచ్చారు.
కోర్టుల్లో అడ్డుపుల్లలు.. పిల్‌లపై పోరాటం
ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనే దురుద్దేశంతో, కొందరి ప్రోద్బలంతో హైకోర్టులో పిల్‌లు వేశారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ పాలసీ వల్ల రాష్ట్రానికి, జంట నగరాల ప్రజలకు జరిగే మేలును కోర్టుకు సవివరంగా వివరిస్తామని చెప్పారు. మార్కెట్ వ్యాల్యూ ఫిక్స్ చేయడానికి ఒక ప్రాతిపదిక లేనందున, ఎస్ఆర్వో వ్యాల్యూ ఆధారంగానే ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం అనేక అసోసియేషన్లతో మాట్లాడామని తెలిపారు. ‘‘మేం పరిశ్రమలను రీలొకేట్ చేస్తున్నాం.. మళ్లీ ఫీజు ఎందుకు కట్టాలి? మాకు ఇన్సెంటివ్ ఇవ్వకుండా మాతోనే ఫీజు కట్టిస్తారా?’’ అని పారిశ్రామికవేత్తలు అడిగారని, వారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆపరేషనల్ గైడ్‌లైన్స్ తయారు చేసేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పర్యావరణ అనుమతులు, కాలుష్య నియంత్రణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ కన్సల్టెన్సీని నియమించుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
హిల్ట్ పాలసీ ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి గ్లోబల్ స్టాండర్డ్స్‌తో కూడిన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏర్పాటుకు, అక్కడ ఈటీపీ ప్లాంట్ల నిర్మాణానికి, లాజిస్టిక్స్ పార్కుల అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు.
అప్పుడున్నట్టు.. ఇప్పుడుందా?
హైదరాబాద్ సిటీలో 1970లో ఐడీపీఎల్ రావడంతో పారిశ్రామిక ప్రస్థానం మొదలైందని శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లిలాంటి ప్రాంతాలను కేవలం పరిశ్రమల కోసమే ప్రత్యేక జోన్లుగా కేటాయించారని చెప్పారు. అప్పట్లో అవి నగరం శివార్లలో ఉండేవని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు.
కానీ, ఈ 50 ఏండ్లలో హైదరాబాద్ ఊహించని విధంగా అభివృద్ధి చెందిందని, పారిశ్రామికవాడలన్నీ జనావాసాలుగా మారాయని చెప్పారు. ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్‌మెంట్లు ఉంటున్నాయని తెలిపారు. దీంతో ఫ్యాక్టరీ పొగంతా నేరుగా బెడ్రూంలలోకే వస్తున్నదని చెప్పారు. పరిశ్రమలు, ఇండ్లకు మధ్య బఫర్ జోన్ అంటూ లేకుండా పోయిందన్నారు.
ఇది పెనుప్రమాదానికి ఆహ్వానం పలకడమేనన్నారు. ‘‘ఇండ్ల మధ్యన పరిశ్రమలుంటే ఏం జరుగుతుందనే దానికి.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలాంటివి ఉదాహరణలు. జపాన్ మినమటా ట్రాజెడీలో.. వ్యర్థాలు నీళ్లలో కలవడం ద్వారా ఒక తరం మొత్తం నరాల వ్యాధితో బాధపడుతున్నది.
1952లో లండన్ భయంకరమైన గ్రేట్ స్మాగ్ ప్రమాదాన్ని చూసింది. కేవలం 5 రోజుల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రిటన్ మేల్కొని క్లీన్ ఎయిర్ చట్టాన్ని తీసుకొచ్చింది. రాయితీలు, మినహాయింపులేవీ లేకుండానే థేమ్స్ నది పక్కన ఉన్న ఫ్యాక్టరీలను శివార్లలోకి తరలించింది. ఆ తర్వాత థేమ్స్ నదిని శుద్ధి చేసింది.
బీజింగ్‌లాంటి పెద్ద నగరాల్లో కాలుష్యం పెరిగిపోతుండడంతో ‘బ్లూ స్కై ప్రొటెక్షన్ ప్లాన్’ను తీసుకొచ్చిన చైనా.. నగరాలకు దూరంగా ఇండస్ట్రియల్ పార్కుల్లోకి పరిశ్రమలను తరలించింది’’ అని వివరించారు.
భవిష్యత్తులో మనదీ అదే పరిస్థితి
ప్రస్తుతం సిటీలోనూ గాలి కాలుష్యం పెరుగుతున్నదని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 174గా ఉంటున్నదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. భూగర్భజలాల్లో లెడ్, మెర్క్యురీ, ఆర్సినిక్‌లాంటి ప్రమాదకరమైన భారలోహాలు ఉండాల్సినదానికన్నా వెయ్యి శాతం ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాని వల్ల రాబోయే తరాలు జెనెటిక్ సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు.
ఇప్పటికైనా కండ్లు తెరవకపోతే హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయమని హెచ్చరించారు. పిల్లలకు బొమ్మలు, పుస్తకాలు కొనిచ్చినట్టే.. నెబ్యులైజర్లు, ఇన్‌హేలర్లను కొనివ్వాల్సిన రోజులొస్తాయన్నారు. కాబట్టి పరిశ్రమలు బిజినెస్ చేసుకుంటే ప్రభుత్వ పరంగా మద్దతుంటుందని, కానీ, ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సంస్థలకు సూచించారు. ఈ ప్రజలే సంస్థల కస్టమర్లని, వాళ్ల ఉత్పత్తుల వినియోగదారులని చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్ అవతల ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని పరిశ్రమలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ స్లో మోషన్ బయోలాజికల్ డిజాస్టర్ దిశగా వెళ్తున్నదని, ఆర్థిక ఎదుగుదల కోసం ప్రజల ఊపిరితిత్తులను పణంగా పెట్టకూడదని చెప్పారు. ప్రస్తుతమున్న పర్యావరణ అసమతుల్యతను సరిదిద్దే ఆపరేషనే హిల్ట్ పాలసీ అని పేర్కొన్నారు.
దావోస్ ఒప్పందాలు సూపర్ హిట్..
దావోస్‌లో ఒప్పందాల్లో 60 శాతం గ్రౌండింగ్ చేశామని, ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఎంవోయూలు గ్రౌండింగ్ కాలేదని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ‘‘ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కల్పించాం. 2024 లో రూ.40 వేల కోట్లు, 2025లో వచ్చిన రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడుల్లోనూ 60-- శాతం గ్రౌండింగ్ అవుతాయి. ఏడాదిన్నర కాలంలోనే హెచ్‌సీఎల్ సంస్థ 5 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చింది.
కాగ్నిజెంట్, విప్రోలాంటి సంస్థలు క్యూ కడుతున్నాయి” అని వివరించారు. సిర్పూర్ పేపర్ మిల్లు పొల్యూషన్ అంశాన్ని పరిశీలిస్తామని, సర్ సిల్క్ మిల్లు పునరుద్ధరణకు పెట్టుబడిదారులను వెతుకుతున్నామని చెప్పారు.
ఇతర రాష్ట్రాలకు కంపెనీలు తరలిపోకుండా పని చేస్తున్నామని చెప్పారు. కాగా, హెచ్‌ఎంటీలాంటి సంస్థలను తిరిగి ప్రారంభించాలని, లేదంటే రాష్ట్రం ఇచ్చిన భూములను వెనక్కి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. అక్కడినుంచి ఎలాంటి రిప్లై రాలేదన్నారు.
బురదజల్లుతున్నరు..
హిల్ట్ పాలసీతో భూములను ప్రభుత్వం తక్కువ ధరకే అమ్మేస్తున్నదంటూ బీఆర్‌ఎస్ నాయకులు బురదజల్లుతున్నారని, బీజేపీ నాయకులు కూడా వారి బాటలోనే నడుస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ‘‘2013లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నగరం లోపల ఉన్న రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ అవత లికి తరలించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఆ తర్వా త అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ ఆర్ అవతలికి తరలిం చకుండా మాటలతో కాల క్షేపం చేసిం ది. లీజు భూములపై ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రీహోల్డ్ ఇచ్చేందు కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఆగస్టు 29న జీవో 19ని తీసుకొచ్చింది. నాటి బీఆర్‌ఎస్ సర్కా రు ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు ఎందుకిచ్చింది.
ఇక, అంతకుముందే 2020 డిసెంబ ర్ 10న ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారా దత్తం చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నిం చింది. ఇప్పుడు తమ ప్రభుత్వా న్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలు.. అప్పుడెందుకు మాట్లాడలేదు. ‘హిల్ట్’ పాలసీపై ఏదో చేద్దామనుకుని బీఆర్‌ఎస్ నాయకుడు పారిశ్రామిక వాడల్లో ఫీల్డ్ విజిట్‌కు వెళ్లారు.
పరిశ్రమల యజమానులు, అసోసియే షన్ నాయకుల స్పందన చూసి అవాక్కయ్యా రు. హిల్ట్ పాలసీ విషయంలో ప్రభుత్వం అత్యం త పారదర్శకంగా వ్యవహరిస్తున్నది. ఈ పాలసీ కింద కన్వర్ట్ చేసే భూములు ప్రభుత్వ భూములు కావు. ఆ భూములు పరిశ్రమల యజమానులవే. బలవంతంగా చేసేదేమీ లేదు. పరిశ్రమల యజమానులు స్వచ్ఛందంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. టీజీఐఐసీ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది”అని చెప్పారు.
భూలావాదేవీలపై విచారణకు సిద్ధం..
రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పాలసీపై ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని
డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారకూడదనే ఈ పాలసీ తెచ్చాం. కానీ, బీఆర్ఎస్ లీడర్లు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు.
రూ.5 లక్షల కోట్ల కుంభకోణమని ఒకరు, 9 వేల ఎకరాల అమ్మకమని మరొకరు ఆరోపణలు చేస్తున్నారు. అనుమానాలు ఉన్న సభ్యులు ఎవరైనా ప్రభుత్వానికి లేఖ రాయండి. 2014 నుంచి నేటి హిల్ట్ పాలసీ వరకు జరిగిన అన్ని భూలావాదేవీలపై ఏ ఏజెన్సీతోనైనా, ఎలాంటి విచారణకైనా మా ప్రభుత్వం సిద్ధం’’ అని సవాల్ విసిరారు.
గత ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తులకు లీజు భూములపై యాజమాన్య హక్కులు కల్పించిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ హోల్డ్, గ్రిడ్ పాల సీల వల్ల కేవలం రూ.574 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని.. కానీ తాము తెచ్చిన హిల్ట్ పాలసీ ద్వారా రూ.10,776 కోట్ల ఆదాయం రానుందని వెల్లడించారు.
