హైదరాబాద్లోని ఈ స్కూళ్లకు.. రెండు రోజులు సెలవు

హైదరాబాద్లోని ఈ స్కూళ్లకు.. రెండు రోజులు సెలవు

హైదరాబాద్లోని పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఆగస్టు 29, 30వ తేదీల్లో హైదరాబాద్లోని పలు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకు కేంద్రాలుగా ఎంపికైన పాఠశాలలు ఆగస్టు 29, 30వ తేదీల్లో మూతపడనున్నాయి.  ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆగస్టు 29,30 తేదీల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II పోస్టుల భర్తీకి పరీక్షను నిర్వహించనుంది. 783 పోస్టుల కోసం  మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం, మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో గ్రూప్ -2 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహణ పూర్తయ్యాక.. ప్రిలిమినరీ కీని సెప్టెంబరులోగా ప్రకటించనుంది టీఎస్పీఎస్సీ.

రాష్ట్రంలో గ్రూప్ 2 కేటగిరీ కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.  అభ్యర్థుల నుంచి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. గ్రూప్‌-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. ఈ గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను  టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది.