వైరస్ లకు మొక్కల జిగురుతో చెక్...! కనిపెట్టిన హైదరాబాద్ సీసీఎంబీ సైంటిస్టులు

వైరస్ లకు మొక్కల జిగురుతో చెక్...! కనిపెట్టిన హైదరాబాద్ సీసీఎంబీ సైంటిస్టులు
  • మొక్కల ఆత్మరక్షణలో అసలు రహస్యం 
  • వైరస్​ను బంధించేందుకు మాలిక్యులర్ గ్లూను వాడుతున్న మొక్కలు
  • పునరుత్పత్తి కాకుండా జిగురు ఉచ్చులతో వైరస్​కు బ్రేక్
  • వ్యవసాయంతోపాటు మానవ వైద్యరంగంలో ఇదే గొప్ప ముందడుగు అంటున్న సైంటిస్టులు 

హైదరాబాద్, వెలుగు:  వైరస్​లు దాడి చేసినప్పుడు మనుషుల్లాగా మొక్కలు ఊరికే ఉండవు.. అవి కూడా ఎదురుదాడి చేస్తాయి. తమపై దాడికి వచ్చే వైరస్​లను బంధించి, వాటి అంతు చూసేందుకు మొక్కలు ఒక రకమైన జిగురు ఉచ్చులను వాడుతున్నాయని హైదరాబాద్‌‌ లోని సీఎస్ఐఆర్- సీసీఎంబీ సైంటిస్టులు కనిపెట్టారు. మొక్కల్లో ఉండే ఈ అద్భుతమైన డిఫెన్స్ మెకానిజంను డాక్టర్ మందార్ వి. దేశ్‌‌ముఖ్ నేతృత్వంలోని బృందం డీకోడ్ చేసింది. ఈ రీసెర్చ్ వివరాలు ప్రతిష్టాత్మక ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్ సొసైటీ’ లో పబ్లిష్ అయ్యాయి. 

సాధారణంగా వైరస్‌‌‌‌ లు మొక్క కణాల్లోకి ప్రవేశించాక తమ ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఏ  ద్వారా వేగంగా విస్తరిస్తాయి. ఈ ప్రాసెస్‌‌‌‌ కు అడ్డుకట్ట వేసేందుకు మొక్కల్లో 'dsRBD' అనే ప్రత్యేక ప్రోటీన్ భాగాలు ఉంటాయి. సీసీఎంబీ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. DRB2, DRB3, DRB5 అనే ప్రోటీన్లు వైరస్ ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఏను చూసిన వెంటనే యాక్టివేట్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఒక జిగురు చుక్క లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ జిగురు ఉచ్చులోనే వైరస్ ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఏ బందీ అయిపోతుంది. ఫలితంగా వైరస్ పునరుత్పత్తి ఆగిపోయి, మొక్క సురక్షితంగా ఉంటుంది.

శక్తి ఉంటేనే ఉచ్చు...

ఈ జిగురు ఉచ్చులు ఎప్పుడు ఏర్పడాలి? ఎప్పుడు కరిగిపోవాలి? అనేది మొక్కల కణాల్లోని రసాయన మార్పులపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లో ఉండే ఏటీపీ అనే శక్తి అణువుల మోతాదును బట్టి ఈ జిగురు చుక్కలు ఏర్పడతాయి. ఒక పరిమితి దాటి ఏటీపీ పెరిగితే ఇవి మళ్లీ కరిగిపోతాయి. అలాగే, ద్రావణంలో ఉప్పు సాంద్రత పెరిగితే ఈ ప్రోటీన్-ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఏ బంధం విడిపోతుందని ఎన్ఎమ్ఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా శాస్త్రవేత్తలు నిరూపించారు. మొక్కలు తమ అవసరానికి తగినట్టుగా ఈ రక్షణ వ్యవస్థను ఎంత తెలివిగా వాడుకుంటున్నాయో ఈ రీసెర్చ్‌‌‌‌ బయటపెట్టింది.

క్యాన్సర్, మతిమరుపు వ్యాధులకూ చెక్

ఈ పరిశోధన కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాదని,  మానవ వైద్య రంగంలోనూ ఇది పెనుమార్పులు తెచ్చే ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. మనుషుల్లో వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా వంటి మతిమరుపు వ్యాధులు, అలాగే కొన్ని రకాల క్యాన్సర్లకు కణాల్లో ప్రోటీన్లు గడ్డకట్టడమే ప్రధాన కారణం. మొక్కలు ఈ ప్రోటీన్ గడ్డలను ఎలా నియంత్రిస్తున్నాయో, ఎలా కరిగిస్తున్నాయో పూర్తిగా అర్థం చేసుకుంటే.. మనుషుల్లో వచ్చే ఈ మొండి వ్యాధులకు మందులు కనిపెట్టడం సులభమవుతుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్​లో శక్తివంతమైన పంట రకాలు

ఈ రీసెర్చ్ కోసం శాస్త్రవేత్తలు ఎన్ఎమ్ఆర్, ఫ్రాప్ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడారు. ఫ్రాప్ పరీక్షలో ఈ జిగురు చుక్కల లోపల ప్రోటీన్లు చాలానెమ్మదిగా కదులుతున్నట్లు గుర్తించారు. అంటే వైరస్‌‌‌‌ ను ఇవి గట్టిగా పట్టుకుని ఉంచుతాయని అర్థం. ఈ అధ్యయనాన్ని సీసీఎంబీ సీనియర్ సైంటిస్ట్ మందార్ వి. దేశ్‌‌‌‌ముఖ్ నేతృత్వంలో జయదీప్ పాల్, దేబదత్తా పాత్ర, ప్రీతి చందా బెహరా, సుప్రీతి దాస్, ఉపాసన రాయ్ బృందం నిర్వహించింది.  

వైరస్‌‌‌‌ల వల్ల ఏటా కోట్లాది రూపాయల పంట నష్టం జరుగుతుంటుంది. సీసీఎంబీ కనుగొన్న ఈ కొత్త విషయాన్ని ఆధారంగా చేసుకుని, భవిష్యత్తులో వైరస్‌‌‌‌ లను తట్టుకునే శక్తివంతమైన పంట రకాలను అభివృద్ధి చేయవచ్చు. అటు రైతన్నలకు, ఇటు వైద్య రంగంలో రోగులకు ఈ పరిశోధన ఒక గొప్ప వరంగా మారబోతోందని సైంటిస్టులు స్పష్టంచేస్తున్నారు.